చుక్కలు చూపించిన మెట్రో : లోపాలపై ప్రయాణికుల ఆగ్రహం

  • Published By: madhu ,Published On : November 20, 2019 / 12:29 AM IST
చుక్కలు చూపించిన మెట్రో : లోపాలపై ప్రయాణికుల ఆగ్రహం

Updated On : November 20, 2019 / 12:29 AM IST

నగరవాసులకు మెట్రో రైల్ మరోసారి చుక్కలు చూపించింది. పీక్ అవర్స్‌లో తలెత్తిన ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సమస్యతో.. అమీర్ పేట్ స్టేషన్ మొత్తం సిటీ వాసులతో జామ్ అయిపోయింది. రెండున్నర గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటల 25 నిమిషాలకు.. నాగోల్-హైటెక్ సిటీ రూట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. అమీర్ పేట్ స్టేషన్‌లో పెద్ద శబ్దం చేస్తూ.. మెట్రో రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక షాక్‌కు గురయ్యారు. తర్వాత.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులను కిందకి దించారు. పట్టాల మీదుగా.. అమీర్‌పేట్ స్టేషన్‌కు తరలించారు.

అమీర్‌పేట్ – బేగంపేట్ రూట్ మధ్యలో ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సమస్య తలెత్తిందని నిర్ధారించారు. రెండున్నర గంటలకు పైగా ఒక ట్రాక్‌పై పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. పీక్ అవర్స్‌లో మెట్రో సేవలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. చాలా మంది ప్రయాణికులు.. అమీర్‌పేట్ స్టేషన్లో పడిగాపులు కాశారు. మరమ్మత్తులు చేసేందుకు టైం పట్టడంతో.. మెట్రో సిబ్బంది కాసేపు టికెట్ కౌంటర్లు కూడా మూసేశారు. రెండున్నర గంటల తర్వాత సింగిల్ ట్రాక్‌పైనే సేవలను పునరుద్ధరించారు. సాయంత్రం ఆరున్నరకు నిలిచిన సేవలు.. రాత్రి తొమ్మిదిన్నర టైంలో తిరిగి ప్రారంభమయ్యాయి.

ఆఫీసుల నుంచి మెట్రో స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికులకు.. రైళ్లు నిలిచిపోయాయన్న వార్త.. షాక్‌కి గురి చేసింది. బస్సులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో.. ఇంటికి ఎలా వెళ్లాలో తెలియక టెన్షన్ పడ్డారు. ఏం చేయాలో తెలియక.. సేవలు పునరుద్ధరించే వరకు స్టేషన్లలోనే వెయిట్ చేశారు. గంటలకు పైగా సేవలు నిలిచిపోవడంతో.. మెట్రో అధికారులు, సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సాధారణంగా సాయంత్రం 6 నుంచి రాత్రి పది వరకు మెట్రోకు పీక్ అవర్స్. ఈ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికుల సంఖ్య కూడా బాగా పెరిగింది. ఎల్బీనగర్ – మియాపూర్ రూట్‌తో పోలిస్తే.. నాగోల్ – హైటెక్ సిటీ రూట్‌లో రష్ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. మెట్రో అధికారులు ప్రతి 3 నిమిషాలకో రైలు నడుపుతున్నారు. అంటే 2 ట్రాక్‌లపై.. 40 రైళ్లు నడుస్తుంటాయి. ప్రతి రైల్లో.. వెయ్యికి పైగా ప్రయాణికులుంటారు.

అంటే.. గంటపాటు రైళ్లు ఆగిపోతే.. 40 వేల మంది ఇబ్బందిపడతారు. ఈ లెక్కన.. మంగళవారం సాయంత్రం రెండున్నర గంటలకు పైగా మెట్రో సేవలు నిలిచిపోయాయి. దాదాపు 50 వేల మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డట్లు అంచనా వేస్తున్నారు. అత్యున్నత టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన హైదరాబాద్ మెట్రోలో.. తరచుగా తలెత్తుతున్న సాంకేతిక లోపాలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు.. ప్రయాణికులు పెరుగుతున్న టైంలో.. ఇలాంటి ఇబ్బందులు మెట్రో ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేస్తున్నాయి.
Read More : ఆర్టీసీ సమ్మె @47వ రోజు : హైకోర్టులో విచారణ..ఉత్కంఠ