మున్సిపాలిటీలు కొట్టు.. TPCC పట్టు!

  • Published By: sreehari ,Published On : January 14, 2020 / 12:32 PM IST
మున్సిపాలిటీలు కొట్టు.. TPCC పట్టు!

Updated On : January 14, 2020 / 12:32 PM IST

మునిసిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీతో పాటు పార్టీ నాయకులకు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మునిసిపాలిటీ ఎన్నికల తర్వాత పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. దీంతో పార్టీ చీఫ్‌ పదవి కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. కాకపోతే వీరికి ఆ పదవి అంత ఈజీగా వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే మున్సిపల్‌ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిపించుకునే వాళ్లకే ఆ పోస్టు దక్కుతుందనే ప్రచారం మొదలైంది. పార్టీ హైకమాండ్‌ కూడా అలాంటి ఆలోచనతోనే ఉందంటున్నారు. దీంతో నేతలు ఆ పనిలో ఇప్పుడు పడ్డారట.

ఎన్నికలపై దిశా నిర్దేశం :
పీసీసీ పదవి ఆశిస్తున్న నేతలు… తాము బాధ్యతలు తీసుకున్న మునిసిపాలిటీలో, కార్పొరేషన్‌లో పార్టీని గెలిపించి సత్తా చాటేసుకోవాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా  హైకమాండ్ దృష్టిలో పడి, చాన్సు దక్కుతుందని అనుకుంటున్నారట. ఇప్పటికే ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేస్తున్నారు. అధ్యక్ష రేస్‌లో ఉన్నవారు తమ పరిధిలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని స్కెచ్ వేస్తున్నారు.

మునిసిపాలిటీల బాధ్యత రేవంత్‌కు :
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్, కొడంగల్ మునిసిపాలిటీ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి పార్టీ అప్పగించింది ఎలాగైనా మెజార్టీ స్థానాలను గెలిపించి, తన సత్తా చాటుకొని, పార్టీ చీఫ్‌ పదవిని పట్టేయాలని ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల బాధ్యతలను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీసుకున్నారు. ఆయన కూడా కార్యకర్తల మీటింగులతో బిజీబిజీగా ఉన్నారట. నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల బాధ్యతలను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు. ఈసారి మున్సిపాలిటీలను గెలిపించి హైకమాండ్ వద్ద తన సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలని చూస్తున్నారట.

ఎవరో స్టామినా ఎంతో?
మరోపక్క, ఖమ్మం జిల్లాలోని మునిసిపాలిటీలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. ఎలాగైనా ఎక్కువ మున్సిపాలిటీలను గెలుచుకుని హైకమాండ్‌ దృష్టిలో పడాలని చూస్తున్నారట. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని కార్పొరేషన్, మునిసిపాలిటీల బాధ్యత తీసుకొని విజయానికి వ్యూహాలను రచిస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బాధ్యతలను తీసుకొని, గెలుపు కోసం కృషి చేస్తున్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, సదాశివపేట్ మునిసిపాలిటీలను సొంతం చేసుకునేందుకు తపించిపోతున్నారు. మొత్తం మీద పీసీసీ చీఫ్‌ పదవి కోసం పోటీలో ఉన్న నేతలంతా ఎలాగైనా తమ పరిధిలోని మున్సిపాలిటీలను పార్టీపరం చేసేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నారు. మరి ఎవరి స్టామినా ఏంటో తేలిపోవాలంటే కొన్ని రోజులు ఓపిక పడితే చాలని జనాలు అంటున్నారు.