కార్గో సేల్స్ రిప్రజెంటేటివ్స్‌గా RTC సిబ్బంది

తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కార్గో సేవల్ని ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ప్రయాణికులకు ఉపయోగకరంగా లేని 800 బస్సుల్ని కార్గో సేవల కోసం గుర్తించారు. వీటిని బస్ బాడీ బిల్డింగ్ కేంద్రాలకు పంపి కార్గో సేవలకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ముందుగా 500 బస్సుల్ని వినియోగించాలని… ఆదరణ పెరిగితే కార్గో సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు. జనవరిలోనే సేవలు ప్రారంభించాలని సీఎం ఆదేశించినప్పటికీ… బస్సుల బాడీ బిల్డింగ్‌లో ఆలస్యం కావడంతో వాయిదా పడింది. హడావుడిగా సేవలు ప్రారంభించకుండా పూర్తిగా బస్సులు సిద్ధమయ్యాకే అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చేతులమీదుగా కార్గో సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ తొలిసారి కార్గో సేవల్లోకి ప్రవేశిస్తుండటంతో నష్టాలు రాకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటోంది. ముందుగా ప్రభుత్వరంగ సంస్ధల్లోని స్టేషనరీ, మద్యం, సివిల్ సప్లయ్ శాఖల్లో వస్తువుల సరఫరా మొదలుపెట్టాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రైవేట్ కంపెనీలకు సేవలందించాలనుకుంటున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారులు అధ్యయనం చేయించారు.
ప్రైవేట్ కార్గో సేవలందిస్తున్న సంస్థలు ఎలా సరుకు రవాణా చేస్తున్నాయి? క్వింటాకు ఎంత వసూలు చేస్తున్నాయి? కిలోమీటరుకు ఎంత ఛార్జ్ చేస్తున్నాయన్న అంశాలపై వివరాలు సేకరించారు. అలాగే కార్గో సేవల కోసం హైదరాబాద్‌లో ఇటీవల కుదించిన బస్సుల సిబ్బందిని వినియోగించబోతున్నారు. వివిధ డిపోల్లో ఖాళీగా ఉన్న సిబ్బందిని కార్గో సేల్స్ రిప్రజెంటేటివ్స్‌గా వాడుకుంటారు. కార్గో సేవలందించే బస్సులు మియాపూర్ బాడీ బిల్డింగ్ కేంద్రంలో ఇప్పటికే సిద్ధమయ్యాయి. వీటిని రవాణశాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు పరిశీలించారు. వచ్చే నెల్లో 50 బస్సులతో సేవలు ప్రారంభించాలని నిర్ణయించారు.