పోలీసుల అదుపులో మహిళలు : స్పందించిన జాతీయ మహిళా కమీషన్

  • Published By: chvmurthy ,Published On : January 10, 2020 / 02:52 PM IST
పోలీసుల అదుపులో మహిళలు : స్పందించిన జాతీయ మహిళా కమీషన్

Updated On : January 10, 2020 / 2:52 PM IST

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విజయవాడ బందర్ రోడ్డులో మహిళలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. సాయంత్రం 6 గంటలు దాటినా మహిళలను విడిచిపెట్టకుండా పోలీసులు అత్యుత్సాహం చూపించటంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మొదట బెంజి సర్కిల్ నుంచి బందరు రోడ్డులో సబ్ కలెక్టర్ కార్యాలయం వైపు ఊరేగింపుగా బయలుదేరిన మహిళలను పోలీసులు పిడబ్ల్యూడీ గ్రౌండ్స్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు. నల్ల చీరలతో మహిళల నిరసన చేపట్టగా… మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్ట్‌లు చేశారని మహిళలు ఆరోపించారు.

బందరు రోడ్డులో ఆర్టీఏ ఆఫీస్‌ దగ్గర కూడా రోడ్డుపై మహిళలు బైఠాయించటంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. ఈ క్రమంలో నగరంలో అరెస్టు చేసిన మహిళలు అందరినీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు తరలించారు.  రాత్రి 7 గంటలైన పోలీసుల అదుపులో ఉన్న మహిళలను విడుదల చేయకపోవటంతో మున్సిపల్ స్టేడియం గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

టీడీపీ ఎంపీ కేశినేని నాని. మాజీ మంత్రి దేవినేని ఉమా. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో సహా మహిళల కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నాయకులు బందర్ రోడ్డుపై  బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మహిళలను ఒక్కోక్కరిని ఫోటోలు తీస్తున్నారు పోలీసులు. ఆధార్ కార్డ్, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు వివరాలు ఇస్తేనే విడుదల చేస్తామని పోలీసులు చెప్పటంతో మహిళలు  భయాందోళనకు గురవుతున్నారు.  

కాగా….. సాయంత్రం 6 గంటల తర్వాత మహిళలను పోలీస్‌ స్టేషన్లలో ఉంచకూడదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర అన్నారు. ఇది మహిళా హక్కులకు విరుద్ధమని… మహిళలను విడుదల చేయకపోతే జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని  ఆయన హెచ్చరించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తే అదుపులోకి తీసుకోవడం చట్ట విరుద్ధమని మండిపడ్డారు. హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ వేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 

శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న రాజధాని మహిళలను అరెస్ట్‌ చేసి వారిని రాత్రి 6గంటల తర్వాత కూడా విడుదల చేయకపోవటం పట్ల జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. సా. 6 గంటల తర్వాత మహిళలను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచకూడదని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అన్నారు.  వెంటనే మహిళలను విడుదల చేయాలని ఆమె ట్విట్టర్‌లో ఏపీ సీఎం జగన్ ను కోరారు. పోలీస్‌ స్టేషన్‌లో మహిళలు ఉన్న వీడియోలను రేఖాశర్మకు మహిళలు ట్వీట్‌ చేశారు.