సత్యాన్ని ఓడించలేరు…డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగింపుపై సచిన్ పైలట్

రాజస్థాన్ డిప్యూటీ సీఎం,పీసీసీ చీఫ్ పదవుల నుంచి కాంగ్రెస్ తనను తొలగించడంపై సచిన్ పైలట్ స్పందించారు. సత్యం పలికేవారిని పరేషాన్ చేయవచ్చు కానీ సత్యాన్ని ఓడించలేమమంటూ సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన మరుక్షణమే ఆయన తన ట్విట్టర్‌లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వరుసగా రెండవ రోజు కూడా పార్టీ సమావేశాలకు సచిన్ పైలట్ దూరంగానే ఉన్నారు. మంగళవారం జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకాలేదు. దీంతో సచిన్ పైలట్ ను పార్టీ నుంచి తొలగించాలని ఆ భేటీలో పాల్గొన్న 102 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలోనే సచిన్ పైలట్‌ను రాజస్థాన్ డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా తొలగించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సుర్జేవాలా మంగళవారం ఢిల్లీలో చెప్పారు. సచిన్ పైలట్ వెంట ఉన్నవిశ్వేందర్ సింగ్, రమేష్ మీనాలను మంత్రి పదవుల నుంచి నుంచి తొలగించినట్లు ఆయన వెల్లడించారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ దోతస్రాను కొత్త పీసీసీ,డిప్యూటీ సీఎంగా నియమించినట్లు తెలిపారు.
మరోవైపు, తమ ప్రభుత్వాన్ని కూల్చాలన్న కుట్ర ఆర్నెళ్లుగా సాగుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నదని ఆయన ఆరోపించారు. సచిన్ పైలట్ వద్ద ఉన్న 30 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ.. వాళ్లేమీ పార్టీ పెట్టలేరని గెహ్లాట్ అన్నారు.