నెల్లిమర్లలో నెగ్గేదెవరు : వైసీపీలో టిక్కెట్ల రగడ.. టీడీపీలో వ్యతిరేకత
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి.
విజయనగరం : వాస్తవానికి విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఫ్యాను గాలి వీస్తోంది. నేతల మధ్య టిక్కెట్ ఫైట్ మొదటికే మోసం తెచ్చేలా ఉంది. అధికార పక్షానికి ఈసారి ఎన్నికలు నిజంగానే పరీక్ష కాబోతున్నాయి. ఇంతకీ, వచ్చే ఎన్నికల్లో ఫ్యాను పార్టీలో టికెట్లు దక్కించుకునే నేతలెవరు. వారి బలా బలాలేంటీ. నేతలు విబేధాలు వీడేనా.. తెలుగుదేశం పుంజుకునేనా..
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్క వైసీపీ అభ్యర్ధిగా మళ్లీ బొత్స కుటుంబానికే అవకాశం వస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బొత్స బంధువు మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడికే దాదాపుగా టిక్కెట్ ఖరారైందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే, తొలుత నెల్లిమర్ల వైసీపీ టికెట్టును మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు పెనుమత్స సాంబశివరాజుకు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్ హామీ ఇచ్చారట. మారిన పరిస్థితిల కారణంగా జగన్ తన హామీని వెనక్కి తీసుకుని అప్పలనాయుడుకే మొగ్గు చూపించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మనస్తాపం చెందిన సాంబశివరాజు వర్గం.. పార్టీని వీడేందుకు సిద్ధమైంది. వారిని బుజ్జగించిన జగన్.. కొన్ని హామీలతో ఊరడించినట్లు తెలుస్తోంది.
సాంబశివరాజు వర్గం మాత్రం ఆ షాక్‌తో సైలెంట్ అయిపోయింది. నెల్లిమర్ల మండలంలో మంచి పట్టుంది. ఆయన అనుచరులైన భోగాపురం నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనిరాజులకు భోగాపురం మండలంలో ఓటు బ్యాంకు ఉంది. ఈ నాయకులంతా కలిసి వైసీపీ అభ్యర్థికి సహకరించకపోతే ఆ పార్టీ గట్టేక్కే పరిస్థితి లేదు. మరోపక్క బడ్డుకొండ అప్పలనాయుడుకు టికెట్టు ఖరారు చేయడంపై బొత్స కుటుంబీకుల్లోనే కొందరికి ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బొత్స కుటుంబంలో విభేదాలు కూడా వస్తున్నట్లు సమాచారం. పూసపాటిరేగ మండలంలో తనకంటూ సొంత ఇమేజ్ ఉన్న లక్ష్మణరావుకు.. మంచి ఓటు బ్యాంకు కూడా ఉంది. అటు సాంబశివరాజు వర్గం, ఇటు బొత్స లక్ష్మణరావు వర్గం బడ్డుకొండ అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉండటంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి వైసీపీకి అనుకూలంగా ఉన్నా.. పార్టీలో తలెత్తిన ఈ విబేధాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన శ్రేణుల్లో నెలకొంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు నియోజకవర్గ ప్రజలను నిరాశకు గురిచేసిందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పోరాటంలో రైతుల పక్షాన ఎమ్మెల్యే నిలబడకపోవడం, నియోజకవర్గంలో మూడు మండలాలకు సాగునీటిని అందజేసేందుకు నిర్మితమవుతున్న తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంతో పాటు నెల్లిమర్ల జూట్ మిల్లు సమస్యపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం వంటివి సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రతికూల అంశాలుగా పరిణమించాయి. ఎమ్మెల్యే సిఫార్సు వలన నియోజకవర్గంలో చిన్న పని కూడా జరగడం లేదన్న అసంతృప్తి సాధారణ కార్యకర్తలతో పాటు చోటా మోటా నేతల్లో సైతం నెలకొంది. ఈ ప్రతికూల అంశాలే వైసీపీ బలోపేతానికి దోహదపడుతున్నాయని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నియోజవర్గంలో మంచి పట్టున్న నేత. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈయన.. అంతకుముందు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో వైసీపీ బాగా పుంజుకోవడం, బొత్స కుటుంబానికి చెందిన నాయకుడు కావడం.. అప్పలనాయుడుకి కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని ప్రస్తుత పరిస్థితిల్లో బడ్డుకొండకు పోటీ ఇవ్వలేరన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
జనసేన కూడా బరిలో నిలబడేందుకు నుంచే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ నుంచి జిల్లా సమన్వయకర్త లోకం ప్రసాద్ గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని పోటీ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. స్థానికంగా తన సంస్థ ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పించిన ఈయన.. వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాంకును శాసిస్తారన్న వాదన ఉంది. అయితే జనసేన పార్టీ అభ్యర్థి ప్రధాన ప్రత్యర్థి కాకపోయినప్పటికీ, పరోక్షంగా వైసీపీ ఓట్లు చీల్చుతారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి నెల్లిమర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ టికెట్టు వ్యవహారం గందరగోళంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో అసంతృప్తి సెగలు అయోమయానికి దారితీస్తున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల గడ్డపై జెండా ఎగురవేసేది ఎవరో తెలియాలంటే .. మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిందే.