వైసీపీ మెడకు ’అమరావతి’ ఉచ్చు : నేతల విరుద్ధమైన వ్యాఖ్యలు

గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజులు అధికార, విపక్షాలు మాటలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి. ఇవే ఇపుడు అధికార పార్టీకి వరంలా మారాయి. అమరావతి నిర్మాణంపై జగన్ ఏమన్నారు ?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు…రాజధాని అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, విమర్శలు చేస్తోంది ప్రతిపక్ష వైసీపీ. అయితే అమరావతి అంశమే…వైసీపీని ఇరుకున పడేలా చేసింది. రాజధాని నిర్మాణంపై పార్టీ అధినేత ఒక రకంగా వ్యాఖ్యలు చేస్తే….నేతలు మరో రకంగా కామెంట్ చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని…మేనిఫెస్టోలో కూడా పెడుతామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అయితే జగన్ వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. దీంతో ఆ పార్టీ కొత్త చిక్కుల్లో పడింది.
ఢిల్లీలో ఇండియా టుడే చానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తారా? లేక నిలిపివేస్తారా? అన్న యాంకర్ ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం చెప్పలేదు. అమరావతి నిర్మాణ ప్రక్రియపై ఆరోపణలు, విమర్శలు చేశారు. రాజధాని ఒక పెద్ద కుంభకోణమన్న జగన్…. రాజధాని భూసమీకరణ ముసుగులో రైతుల నుంచి భూములు సేకరించారని ఆరోపించారు. 16వందల ఎకరాలను తక్కువ ధరకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కట్టబెట్టారని విమర్శించారు. అయితే అసలు ప్రశ్నకు మాత్రం సమాధానం దాటవేశారు జగన్.
ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలే…తెలుగుదేశం పార్టీకి ఆయుధంలా దొరికినట్లయింది. అమరావతి నిర్మాణంపై జగన్ సమాధానం దాటవేయడంపై మంత్రి దేవినేని స్పందించారు. బీజేపీ, కేసీఆర్, ఓవైసీతో జగన్ కుమ్మక్కయ్యారన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా… ఓట్లు అడిగే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. జగన్‌ను సీఎం చేస్తే….రాజధానిని ఇడుపులపాయకు తరలిస్తారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు చేసిన ప్రచారాన్నే…తెలుగుదేశం పార్టీ మళ్లీ చేస్తోంది. దీంతో అమరావతి నిర్మాణం పంచాయతీ…వైసీపీ మెడకు చుట్టుకుంటోంది.