ఆ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేలా వైసీపీ వ్యూహం

గతంలో నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని.. లేకుంటే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్.

ఆ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేలా వైసీపీ వ్యూహం

YCP Strategy For Victory in Rajya Sabha Elections

Updated On : January 23, 2024 / 9:01 PM IST

Rajya Sabha Elections : వచ్చే రాజ్యసభ ఎన్నికల టార్గెట్ గా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. వేమిరెడ్డి, కనకమేడల, సీఎం రమేష్ స్థానాలు త్వరలో ఖాళీ అవనున్నాయి. ఈ మూడింటిలో ఒకటి వైసీపీ సిట్టింగ్. రెండు టీడీపీ స్థానాలు.. దీంతో మూడు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకోవాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాస్ లను అభ్యర్థులుగా ఖరారు చేసింది వైసీపీ. సంఖ్యా బలంపరంగా చూస్తే ఈ మూడు స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది.

అయితే, మార్పులు చేర్పుల కారణంగా అసంతృప్త ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వెళ్తే వారి సంఖ్యా బలం పెరిగే అవకాశం ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా టీడీపీ సంఖ్యా బలం తగ్గేలా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోందని సమాచారం. గత ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా క్రాస్ ఓటింగ్ జరగకుండా పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యే లపైనా అనర్హత వేటు వేయాలని ఇప్పటికే ఫిర్యాదు చేసింది వైసీపీ. త్వరలోనే పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా వ్యూహం రచించింది.

Also Read : రూ.40 లక్షలు తీసుకున్నారు..! మంత్రి రోజాపై సంచలన ఆరోపణలు

ఇక, ఏపీలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. టీడీపీ నుంచి వైసీపీకి మారిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి, జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్ లకు.. నోటీసులు పంపారు. పార్టీ మార్పుపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుతో వారికి నోటీసులు పంపారు స్పీకర్. ఇటు వైసీపీ నుండి టీడీపీకి మారిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డిలకు మరోసారి నోటీసులు పంపారు స్పీకర్. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని.. లేకుంటే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. వీరికి గతంలో నోటీసులు ఇచ్చినా సమాధానం ఇవ్వకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు స్పీకర్.

ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలను తమ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టింది వైసీపీ. వైసీపీలో మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగా దాదాపు 28మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో.. పక్కన పెట్టిన ఈ ఎమ్మెల్యేలు అంతా టీడీపీ వైపు వెళ్తే.. వైసీపీ ఒక రాజ్యసభ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటివి జరక్కుండా వైసీపీ అధినాయకత్వం చర్యలు చేపట్టింది. తమ వద్ద ఉన్న ఎమ్మెల్యేలను హోల్డ్ చేసుకుంటూనే.. టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే ప్రయత్నాలు కూడా చేస్తోంది వైసీపీ.

ఇందులో భాగంగానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రాజీనామాను కూడా ఆమోదించారు అసెంబ్లీ స్పీకర్. ఇటీవల మారిన సమీకరణాల నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను కూడా ఆమోదించే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో వాళ్లను పార్టీ నుంచి బహిష్కరించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే స్పీకర్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ నలుగురిపై అనర్హత వేటుకు నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. దానికి సంబంధించి రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల