Kanaka Durga Temple: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. సరస్వతీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు
దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు (బుధవారం) మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు.

Kanka Durga Temple
Dasara Navaratri Utsavalu 2024 at Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడోరోజు (బుధవారం) మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతి దేవిగా దర్శనమివ్వనున్నారు. మూలానక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసిన తరువాత దుర్గాదేవిని శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతా మూర్తి అయిన సరస్వతీ రూపంలో అలంకరిస్తారు. సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని భక్తుల నమ్మకం. మూలానక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భావించి దుర్గమ్మను ఆరాధిస్తారు.
Also Read: Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి నేడు ధన లాభం కలుగును
మూలా నక్షత్రం పురస్కరించుకొని భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి భక్తులు రానున్నారు. దీనికితోడు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రిపై పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. అదనంగా 1100 మంది పోలీసులు, 110 హోల్డింగ్ టీంలు విధులు నిర్వర్తిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు.
మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి అవతారంలో దర్శనమివ్వనున్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రికే భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. రాత్రి 11 గంటల నుంచే కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.