తెరుచుకున్న హసనాంబ దేవాలయం..మహిమల గల అమ్మ వింతలు.. విశేషాలు

Karnataka hasanamba temple speacial : కర్ణాటక హసన్‌లో ప్రముఖ హసనాంబ ఆలయం వార్షిక ఉత్సవాల కోసం శుక్రవారం (నవంబర్ 6,2020) తెరుచుకుంది. ఆలయం 16వ తేదీ వరకు పది రోజుల పాటు తెరిచి ఉండనుంది. కరోనా మహమ్మారి వల్ల మూత పడిన హసనాంబ తిరిగి తెరుచుకుంది. ఈ ఆలయంలో ముందస్తు జాగ్రత్తగా ఈ సారి భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతించారు. కరోనా వల్ల పలు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు పరిమితంగా దర్శనాలు చేయిస్తున్నామని జిల్లా అధికారులు తెలిపారు.
హసన్ నగరంలోని పది ప్రాంతాల్లో అధికారులు ఎల్‌ఈడీలు ఏర్పాటు చేసి ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు అమ్మవారికి జరిగే సేవలను వీక్షించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే భక్తులు 12 రోజుల పాటు www.hasanambalive2020.com వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చని చెప్పారు.ఆలయ తలుపులు తెరిచే ముందు సంప్రదాయబద్దంగా పూజలు చేశారు. కాగా, దేవాలయం ప్రాంగణంలో అరసు వర్గానికి చెందిన నరసింహరాజు అరటి కొమ్మను కత్తితో నరికివేసిన అనంతరం హసనాంబ ఆలయ ప్రధాన ద్వారాలు తెరిచారు.ఈ సందర్భంగా అరటికొమ్మ భాగాలను తీసుకునేందుకు భక్తులు ఎగబడ్డారు.
Karnataka: Hasanamba Temple in Hassan reopened for devotees today for a period of ten days. pic.twitter.com/z55xKlF8pL
— ANI (@ANI) November 6, 2020
హస్సన్ సిటీకి ఆ పేరు ఎలా వచ్చింది?
బెంగుళూరు కు 183 కి. మీ. ల దూరంలో ఉండే హస్సన్ పట్టణానికి హసనాంబ మాత టెంపుల్ కారణంగా హస్సన్ కు ఆ పేరు వచ్చింది. హసనాంబ అమ్మ ఎన్నో మహిమలు కల దేవత. సంవత్సరానికి ఒకే సారి మాత్రమే అమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీ యుజ మాసంలో అంటే సాధారణంగా అక్టోబర్ చివర – నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి నాడు మాత్రమే ఈ టెంపుల్ తెరుస్తారు. ఈ టెంపుల్ కర్నాటక రాష్ట్రం యావత్తూ దీపావళి పండుగ జరుపుకొంటూ వుంటే, సరిగ్గా, దీపావళి మరుసటి రోజు అయిన బాలి పాడ్యమి నాడు మూసి వెయబడుతుంది.
ఒకసారి, ఏడుగురు మాతృకలు అంటే, బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండి దేవతలు ఒక పడవలో దక్షిణ భారత దేశానికి వచ్చినపుడు హస్సన్ పట్టణ అందాలకు ముగ్ధులై, ఆ ప్రదేశాన్ని తమకు నిరంతర నిలయంగా చేసుకోవాలనుకున్నారు. అలా మహేశ్వరి, కౌమారి, వైష్ణవి లు ఆలయంలోని మూడు చీమల పుట్టలను తమ నివాసంగా చేసుకొన్నారు. బ్రాహ్మి కేంచమ్మ యొక్క హాస కోట లోను, ఇంద్రాణి, వారాహి మరియు చాముండి దేవిగేరే హోండా లోని మూడు బావులలోను నివాసం చేసుకున్నారు. సంవత్సరం క్రితం దేవాలయం మూసి వేసే రోజున మాతకు అర్పించిన పూవులు, వెలిగించిన దీపం సంవత్సరం తర్వాత ఆలయం తెరచిన రోజున అదే విధంగా భక్తులకు కనపడటం ఈ దేవాలయంలో విశేషం.
హాసనాంబ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే దేవత
భారతదేశంలోని ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. కానీ హసనాంబ దేవాలయానికి ఎన్నో విశిష్టతలున్నాయి. హాసనాంబ అంటే హాస్యం అంటే నవ్వు అని అర్థం. అందుకే ఈ దేవత సదా నవ్వుతూ ఉంటారు కాబట్టే ఆ దేవతకు హాసనాంబ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంతే కాకుండా తన భక్తులను ఎవరైనా హింసింస్తే అంతే ఉగ్రరూపంగా మారిపోతారట అమ్మవారు.
హసనాంబ దేవాలయంలో కదిలే ‘అత్తగారి’ రాయి
అమ్మవారు భక్తులను హించిసినవారి అంతు చూస్తారని చెబుతారు. దీనికి వెనుక చరిత్ర ఏమిటంటే..హాసనాంబ భక్తులను హాసనాంబ అత్తగారు హింసించేదని చెబుతుంటారు. దీంతో హాసనాంబ తన అత్తగారిని బండరాయిగా మారిపోమ్మని శపించిందట. అలా బండరాయిగా మారిపోయిన అత్తగారు రాయి ఇప్పటికీ హాసనాంబ గర్భాలయంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రాయి రూపంలో ఉన్న అత్త ఒక ఇంచి హాసనాంబ అమ్మవారి దగ్గరకు జరుగుతూంటుదట. ఇలా ఒక రాయి మరో రాయి వద్దకు ఎలా జరుగుతూ ఉందన్న విషయం పై మాత్రం శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినా కనుక్కోలేకపోయారు.
అప్పుడే కలియుగాంతం..
ఎప్పుడైతే ఆ అత్త రూపంలో ఉన్న రాయి హాసనాంబ అమ్మవారి వద్దకు చేరుతుందో అప్పుడు కలియుగాంతం అవుతుందని కథకథలుగా చెబుతారు. హసనాంబ దేవాలయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుస్తారు. అలా తెరుచుకున్న దేవాలయంలో ఏడు రోజులు మాత్రమే అమ్మవారిని భక్తులు దర్శించు కోవడానికి వీలుంటుంది. ఈ సమయంలో కేవలం కర్నాటక నుంచే కాకుండా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు.
అమ్మవారి ముందు రెండు బస్తాల అన్నం.. ఏడాదైనా చెడిపోదు..
అంతే కాకుండా కొన్ని పూలతో పాటు రెండు భస్తాల అన్నాన్ని కూడా అమ్మవారి ముందు పెట్టి ఆలయ గర్భగుడి ద్వారాలను మూసివేస్తారు. మరలా ఏడాది తర్వాత ఆలయ ద్వారాలను తెరిచినప్పుడు ఆ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అదే విధంగా పువ్వులు వాడిపోయి ఉండవు. ఎంత తాజాగా పువ్వుల్ని పెట్టి ఉంచుతారో అంతే తాజాగా ఆ పువ్వులు ఏడాది తరువాత కూడా ఉంటాయి. ఇక ముఖ్యంగా హసనాంబ దేవత ముందు రెండు బస్తాల అన్నాన్ని పెడతారు. గుడి మూసివేసి తిరిగి ఏడాది తరువాత తెరిచినా కూడా ఆ అన్నం వేడిగా ఉండటమే కాకుండా తినడానికి పనికి వచ్చేంత ఫ్రెష్ గా ఉండటం హసనాంబ మహిహేనంటారు.ఈ అన్నాన్ని భక్తులు ప్రసాదంగా తింటారు. సాధారణంగా దీపావళికి ఏడు రోజుల ముందు ఈ దేవాలయం తలపులు తీస్తారు. దీపావళి రోజున ఆయాలన్ని మూసివేస్తారు.
ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం కనిపించవు. ఈ ఆలయంలోపల మనకు తొమ్మిది తలలతో ఉన్న రావణుడు కనిపిస్తాడు. అదే విధంగా సిద్ధేశ్వరస్వామి మనకు లింగ రూపంలో కాకుండా మనిషి రూపంలో కనిపిస్తాడు. ఇవి రెండు చాలా అరుదైన విషయాలు.బెంగళూరు నుంచి 184 కిలోమీటర్ల దూరంలో ఉన్న హసనాంబ దేవాలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.