Samatha Kumbh 2023: వైభవంగా ముగిసిన సమతా కుంభ్‌ 2023 ఉత్సవాలు

Samatha Kumbh 2023: సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి.

Samatha Kumbh 2023: వైభవంగా ముగిసిన సమతా కుంభ్‌ 2023 ఉత్సవాలు

Updated On : February 13, 2023 / 6:55 PM IST

Samatha Kumbh 2023: సమతా కుంభ్‌-2023 ఉత్సవాలు ముగిశాయి. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ వేడుక చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శివారు ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న సమతా కుంభ్‌-2023 వేడుకులు ముగిశాయి. శ్రీరామానుజాచార్య 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. చివరి రోజు తెల్లవారుజాము నుంచే ఆచార్య సన్నిధిలో పెరుమాళ్ల ఆరాధన, సేవకాలం, మంగళాశాసనములు, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణములు కొనసాగాయి.


చివరిరోజు కావడంతో కలశ తీర్థాన్ని తీసుకెళ్లి దివ్యసాకేత క్షేత్రంలోని వైకుంఠనాథుడు, రంగనాథుడు, రఘునాథుడు, ఆంజనేయస్వామి, ఆళ్వార్లకు ప్రోక్షణ జరిపించారు. మూలమూర్తికి ఉత్సవాన్త స్నపనము నిర్వహించారు. ఆ తర్వాత యాగ కార్యక్రమాన్ని నిర్వహించడానికి విచ్చేసిన దేవతాగణానికి పూజా కార్యక్రమాలు జరిపించారు. రంగురంగుల పుష్పాలతో చక్ర మండల రచన చేసి శ్రీపుష్ప యాగం ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ద్వాదశ ఆరాధన కార్యక్రమం జరిగింది. పుష్పాలతో వరుసగా 12 ఆరాధనలు చేశారు. ఇలా సుప్రభాతం నుంచి శయనోత్సవం వరకు 12 సార్లు ఆరాధనలు జరిపించారు.


అనంతరం పెరుమాళ్లను యాగశాలకు తీసుకొచ్చి మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆవాహన చేసిన దేవతలందరికీ ఆరాధన చేసి బలిహరణలు పూర్తయ్యాక దేవతా ఉద్వాసన చేశారు. కార్యక్రమం మొత్తాన్ని నడిపించిన గరుడ్మంతుడి దగ్గరికి వెళ్లి స్వామి ఆజ్ఞతో వారిని కిందకి దించారు. గరుడ పటాన్ని అవరోహణం చేశారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు.

Also Read: శాస్త్రోక్తంగా సామూహిక ఉపనయనాలు, వైభవంగా గజవాహన సేవ

చివరిగా ఆవాహన చేసిన దేవతలందరినీ కలశంలో వేంచేయింపజేశారు. దేవతలతో ఆవాహన చేసినన కుంభాన్ని, యజ్ఞ శేషాన్ని 108 దివ్యదేశాల్లో ఉండే స్వాములకు యజ్ఞరక్ష పెట్టి కుంభతీర్థంతో ప్రోక్షణ జరిపించారు. తర్వాత స్వర్ణ రామానుజులవారి దగ్గర, సమతా మూర్తి దగ్గర ప్రోక్షణ కార్యక్రమం జరిగింది. ప్రోక్షణ తర్వాత ఆ శేష తీర్థాన్ని భక్తులకు అందించారు. ఈ ద్వాదశ ఆరాధన కార్యక్రమంలో 12 ప్రసాదాలు నివేదించారు. అనంతరం ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.