ఇంద్రుడికి విష్ణుమూర్తి చెప్పిన రహస్యం : దీపం వెలిగిస్తే లక్ష్మీకటాక్షం

దీపావళి శరదృతువులో వస్తుంది. శరత్కాలం అంటే వెన్నెల కురిసే కాలం. వెన్నెలను చూస్తే మనస్సుకు చాలా ఆహ్లాదంగా కలుగుతుంది. చల్లని తెల్లని వెన్నెల కాలం కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. దీపావళి పండుగ శతదృతువులో రావటం దీనికి తోడు దీపాల కాంతులు మనస్సుకు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి.
ఐశ్వర్యాలను నిలయమైన లక్ష్మీదేవి పూజ ఈ కాలంలో చేయటం విశేషం. దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడి ఆతిథ్యం స్వీకరించటానికి వస్తాడు. ఇంద్రుడి ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఇంద్రుడికి ఓ మహిమ కలిగిన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దాని విలువ తెలుసుకోకుండా అహంకారంతో తన వాహనం అయిన ఐరావతం మెడలో వేస్తాడు.
ఐరావతం కూడా ఆ హారాన్ని పడవేసి కాలితో తొక్కేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహిస్తాడు. దుర్వాసుడు అంటేనే కోపిష్టి. మరి ఊరుకుంటాడా? దేవేంద్రుని రాజ్యం కోల్పోయి..స్వర్గ సుఖాలకు దూరమై.. సర్వసంపదలు పోగొట్టుకుంటావని శపిస్తాడు. దీంతో అహంకారం అణగిపోయిన ఇంద్రుడు దిక్కులేనివాడిలా తయారయ్యాడు.
దిక్కులేనివాడిగా మారిన ఇంద్రుడు శ్రీహరిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవేంద్రునికి ఒక జ్యోతిని వెలిగించి ఈ దీపాన్ని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు. వెంటనే ఇంద్రుడు దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తాడు. ఇంద్రుడిని అనుగ్రహించిన లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి.