Tirumala : సుదర్శన చక్రస్నానం ఎందుకు ? ఎలా చేస్తారో తెలుసా ?

ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ - అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు.

Tirumala : సుదర్శన చక్రస్నానం ఎందుకు ? ఎలా చేస్తారో తెలుసా ?

Sudharshanam

Updated On : October 15, 2021 / 2:09 PM IST

Sudarshan Chakra Snanam : శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు కోనేటి జలాల్లో పవిత్ర స్నానంతో ముగుస్తుంది. ఎనిమిది రోజుల పాటు వివిధ వాహనాల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిదో రోజు ఉదయం పవిత్ర పుష్కరిణి స్వామి వారి సుదర్శన చక్రస్నానంతో పరిసమాప్తి అవుతుంది. బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే…ఈ చక్రస్నానం కూడా అవబృధస్నానమే అవుతుందని శాస్త్రాలు చెబుతుంటాయి.

Read More : TTD : భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ.. త్వరలో సర్వదర్శనం టోకెన్లు

అలాగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన 2021, అక్టోబర్ 15వ తేదీ శుక్ర‌వారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల నడుమ శ్రీ‌వారి ఆల‌యంలోని ఐనా మ‌హ‌ల్ ముఖ మండ‌పంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రో‌క్తంగా నిర్వహించారు. అనంత‌రం ప్ర‌త్యేకంగా నిర్మించిన చిన్న పుష్క‌రిణిలో ఉద‌యం 10 గంట‌ల‌కు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీ జలంలో ముంచి స్నానం చేయించారు.

Read More : TTD : సాలకట్ల బ్రహ్మోత్సవాలు…చక్రస్నానం, శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ

ఇందులో ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

Read More : Dasra 2021 : ఇంద్రకీలాద్రిపై భక్తుల కిటకిట…చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనం

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం  చేశారు. అభిషేకానంతరం వివిధ పాశురాలను పెద్ద జీయ్యంగార్‌, చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

Read More : United States : బైడెన్ కొలువులో రవి చౌదరికి కీలక పదవి

చక్రస్నానం – లోకం క్షేమం
తొమ్మిది రోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై – లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతులతో ఉండడానికీ – చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక…యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞ నిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంత స్నానం అవభృథం అంటారు. చక్ర స్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది.

Read More : Dhamaka: ఎనర్జీకి తగ్గ టైటిల్ ధమాకా.. డ్యూయెల్ రోల్ మరో బోనస్!

ఈ ఉత్సవాలు చేసిన వారికి, చేయించిన వారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ – అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతుంటారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని, విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారని వెల్లడిస్తున్నారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారని అంటారు.