శాస్త్రం చెబుతున్న సత్యం : మట్టి వినాయకుడ్ని పూజిస్తేనే పుణ్యం

వినాయకుని పూజలో ప్రధానమైనది విగ్రహం. ఇప్పుడంటే పెద్ద పెద్ద విగ్రహాలు, వైరటీలుగా గణనాథులను తయారు చేస్తున్నారు. అంతా కమర్షియల్ గా సాగుతుంది. గతంలో అయితే కేవలం మట్టి గణనాథులనే పూజించే వారు. పొలాల్లో దొరికే మట్టితోనే చేసి పూజించేవారు. ఇదే అసలు సిసలు విగ్రహం అంటున్నారు పండితులు. వినాయక చవితి అంటేనే ప్రకృతి. అందుకే సహజసిద్ధంగా మట్టితోనే వినాయకుడి ప్రతిమ తయారు చేయాలి అంటోంది శాస్త్రం. మట్టి విగ్రహాన్ని పూజించాలి అని చెబుతున్నారు పెద్దలు.
మట్టితోనే మానవుల జీవనం ముడిపడి ఉంది. పండే పంటలు మట్టినుంచే వస్తాయి. వాటిని తినే మానవుడు జీవిస్తున్నాడు. అటువంటి మట్టిని వినాయకుడి ప్రతిమగా మలిచి పూజించుకోవాలి. పూజల తర్వాత మట్టితో చేసిన వినాయకుడిని నిమజ్జనం చేస్తాం..అంటే ప్రకృతిని మళ్లీ ప్రకృతిలోనే కలిపేయటం అన్నమాట. దానికి నిదర్శనమే మట్టి వినాయకుడిని పూజించటం.
విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రంగులు వేయకూడదు. పసుపు, కుంకుమ, గంధంతో అలంకారం చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే పర్యావరణాన్ని కూడా కాపాడిన వారు అవుతారు. రంగులు అద్దినట్లయితే.. ప్రకృతిని నాశనం చేసినట్లే. పూజ ఫలితం కూడా దక్కదు.
విగ్రహాన్ని నిమజ్జనం చేయటానికి నదులు, కాలువలు అందుబాటులో లేకుంటే పిల్ల కాలువల్లో అయినా శ్రద్ధగా నిమజ్జనం చేయొచ్చు. అవి కూడా అందుబాటులో లేని నగరవాసులు శుభ్రం చేసిన బక్కెట్ నీళ్ళలో మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తే మంచిది. ఆ మట్టి నీళ్లను చెట్లకు వేసుకోవచ్చు. ఇలా చేస్తే పర్యావరణాన్ని కాపాడిన వారవుతారు.