Yadagiri Gutta : యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. ధ్వజారోహణం
పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి...శనివారం స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా...

Yadadri Temple
Yadadri Brahmotsavam 2022 : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 2022, మార్చి 04వ తేదీ శుక్రవారం స్వస్తి వాచనంతో అర్చకులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. దివ్యబాలాలయంలో వార్షిక, నవాణ్ణిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారికి నిత్య కైంకర్యాల అనంతరం ధ్వజారోహణం అత్యంత వైభవంగా చేపట్టారు. ధ్వజారోహణం, భేరీపూజ, దేవతాహ్వానం, అగ్నిదేవుడికి ఆరాధన, హవనం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలాలయం మండపం ఎదురుగా అమ్మవార్లను అధిష్టింప చేశారు.
Read More : Yadagiri Gutta : యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు.. ఉగ్రం వీరం మహావిష్ణుం
పట్టువస్త్రాలు, ముత్యాల ఆభరణాలతో స్వామి..అమ్మవార్లను అలకరింప చేశారు. శ్వేత ధ్వజపతాకంపై గరుత్మంతుడి పటాన్ని చిత్రీకరించి వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. గరుడ ముద్దలను గాలిలోకి ఎగురవేశారు. వీటిని స్వీకరించేందుకు మహిళలు ఎగబడ్డారు. దీనిని స్వీకరిస్తే.. సౌభాగ్యంతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం. ఉదయం గరుడ అళ్వారుడికి ఇష్ట నైవేద్యం, ధ్వజ పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు. రాత్రి సకల దేవతలకు ఇష్టమైన మేళతాళాలకు భేరీ పూజ, దేవతాహ్వానం, అగ్నిదేవుడికి ఆరాధన, హవనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతోంది. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్య నిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతరులు పాల్గొన్నారు.
Read More : YSRCP MLA Roja : యాదాద్రి నిర్మాణం అద్భుతం.. ఎవరికీ దక్కని అవకాశం సీఎం కేసీఆర్‌కు దక్కింది
ఇక ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. కోవిడ్ -19 నిబంధనల ప్రకారం వేడుకలను బాలాలయం లోపలే నిర్వహిస్తున్నారు. 2022, మార్చి 04వ తేదీ శుక్రవారం నుంచి మార్చి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సావాలు జరుగనున్నాయి. నిత్య కళ్యాణం, శ్రీ సుదర్శన నారసింహ హోమాలను రద్దు చేశారు. ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ ఉన్నందున బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 10వ తేదీన ఎదుర్కోలు, 11న తిరుకళ్యాణ మహోత్సవం, 12వ తేదీన దివ్య విమాన రథోత్సవం, 13వ తేదీన పూర్ణాహుతి, చక్రతీర్థం, కార్యక్రమాలు నిర్వహించనున్నారు.