పతనం మొదలైంది : 6.2 ఓవర్లకే వెనుదిరిగిన కివీస్ ఓపెనర్లు

ఢిల్లీ : న్యూజిల్యాండ్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్‌ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో అదే జోరు కంటిన్యూ చేయాలని భావిస్తోంది. మౌంట్ మాంగనీలో జరిగే మూడో మ్యాచ్‌తోనే ఐదు వన్డేల సిరీస్ కైవసం చేసుకునేందుకు గేమ్ ప్లాన్ రచిస్తోంది.
న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గప్తిల్, మన్రో ఆట ఆరంభించారు. ఆదిలోనే వీరికి ఎదురుదెబ్బ తగిలింది. షమీ బౌలింగ్‌లో మున్రో (7) వెనుదిరిగాడు. 10 పరుగుల వద్ద వికెట్ పడడంతో గుప్తిల్, విలియమ్సన్‌లు జాగ్రత్తగా ఆడుతున్నారు. కాసేపటికే గుప్తిల్ (13) పెవిలియన్ చేరాడు. ఇతడిని కుమార్ అవుట్ చేశాడు. ప్రస్తుతం 6.1 ఓవర్లకే 2 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 26 పరుగులు చేసింది.
టార్గెట్ పెద్దదైనా… చిన్నదైనా… టీమిండియా మాత్రం తాను పెట్టుకున్న లక్ష్యంవైపు దూసుకుపోతోంది. వన్డేల్లో న్యూజిల్యాండ్‌కు చుక్కలు చూపిస్తోంది. కివీస్ గడ్డపై కాలు పెట్టినప్పటి నుంచి… పదేళ్లుగా ఊరిస్తున్న సిరీస్‌ను కొల్లగొట్టడమే టార్గెట్‌గా వ్యూహాలతో న్యూజిలాండ్‌ను బెంబేలెత్తిస్తోంది టీమిండియా.
కోచ్ రవిశాస్తి నేతృత్వంలో ప్రాక్టీస్‌లో చెమటోడ్చారు ఆటగాళ్లు. ఓపెనర్లు ఆరంభం నుంచే కివీస్ పేసర్లను ఉతికి ఆరేస్తున్నారు. మెరుపు ఆరంభం ఇస్తూ కివీస్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. మంచి ఓపెనింగ్ ఉంటుండటంతో.. తర్వాతి బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. మూడో వన్డేలో కూడా ఇదే జోరు కొనసాగించి మ్యాచ్‌ను శాసించాలని టీమిండియా భావిస్తోంది.