ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు.. స్టార్క్ మళ్లీ దూరం

ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు.. స్టార్క్ మళ్లీ దూరం

Updated On : December 3, 2019 / 1:44 AM IST

ఐపీఎల్‌–2020 కోసం జరిగే వేలంలో సత్తా చాటేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. నవంబర్‌ 30 చివరి తేదీ కావడంతో వీరంతా పేర్లను నమోదు చేసుకున్నారు. లిస్టులో 713 మంది భారత క్రికెటర్లు కాగా, 258 మంది విదేశీయులు. 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్లు పేర్లను ఇవ్వగా… 634 మంది టీమిండియాకు ఆడాలని కలలు కంటున్నవారు. మరో 60 మంది కనీసం ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ అయినా ఆడినవారున్నారు.

ఈ 971 మంది నుంచి తాము కోరుకుంటున్న ఆటగాళ్ల పేర్లను ఎనిమిది ఫ్రాంచైజీలు ఓ షార్ట్ లిస్ట్ చేస్తాయి. డిసెంబర్‌ 9లోగా ఈ ప్రక్రియ పూర్తి అవడంతో ఆ తర్వాత వేలానికి వారి పేర్లను పరిగణిస్తారు. ఐపీఎల్‌లో ప్రస్తుతం గరిష్టంగా 73 మందిని మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది. డిసెంబర్‌ 19న కోల్‌కతాలో వేలం నిర్వహించనున్నారు.

స్టార్క్ మరోసారి ఐపీఎల్‌కు దూరం:
ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ వరుసగా రెండో ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. 2019 ఐపీఎల్‌లో వరల్డ్ కప్ కు ముందు టోర్నీ ఆడబోనని తప్పుకున్నాడు. మరోవైపు ఏడుగురు విదేశీ క్రికెటర్లు రూ. 2 కోట్ల కనీస ధరతో వేలానికి సిద్ధపడుతున్నారు. ఈ జాబితాలో కమిన్స్, హాజల్‌వుడ్, లిన్, మిషెల్‌ మార్ష్, మ్యాక్స్‌వెల్, స్టెయిన్, మాథ్యూస్‌ ఉన్నారు.