వావ్.. అభిషేక్ శర్మతో పాటు మన తెలుగు క్రికెటర్‌కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు? ఎలాగంటే?
ఈ కాంట్రాక్ట్స్ కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

PIC: @BCCI
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాపై కసరత్తు చేస్తుంది. ప్లేయర్స్ ఫామ్ ని బట్టి, అలాగే ఆడే ఫార్మాట్ల ఆధారంగా కాంట్రాక్టులు ఇస్తారు. ఇప్పటికే జట్టులో ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లందరూ ఈ కాంట్రాక్టుల్లో ఉన్నారు.
గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న లేదా ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లను ఈ కాంట్రాక్టుల నుంచి బీసీసీఐ పక్కన పెడుతుంది. అలాగే, నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లను ఈ సెంట్రల్ కాంట్రాక్టులలో చేర్చే అవకాశం ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీంకు చెందిన అభిషేక్ శర్మను గ్రేడ్ సీలో చేర్చే అవకాశముంది. ఇలా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పంజాబీ కుర్రాడికి బీసీసీఐ ఏడాదికి రూ.1 కోటి ఇవ్వనుంది.
బీసీసీఐ విధానాల ప్రకారం.. నిర్ణిత కాలంలో ఒక ఆటగాడు కనీసం మూడు టెస్టులు లేదా ఎనిమిది వన్డేలు లేదా పది టీ20లు ఆడితే గ్రేడ్ సీ కాంట్రాక్ట్‌కి అర్హత పొందుతాడు. అభిషేక్ ఇప్పటివరకు 17 టీ20లు ఆడగా, ఇటీవల కాలంలో (అక్టోబర్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలం) 12 టీ20లు ఆడాడు.
అభిషేక్ (24)తో పాటు, ఆంధ్ర ఆల్‌రౌండర్ నితిశ్ రెడ్డికి కూడా కాంట్రాక్ట్ లిస్ట్‌లో చోటు దక్కే అవకాశముంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు టెస్టుల్లోనూ నితిశ్ ఆడడం వల్ల దీనికి అర్హత సాధించాడు.
ఇంకా, హర్షిత్ రాణా పేరు కూడా చర్చలో ఉంది. రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 ఆడినప్పటికీ, ఒక్కో ఫార్మాట్‌లో అర్హత పొందకపోయినా, మొత్తం మ్యాచ్‌ల పరంగా చూస్తే మంచి ఫామ్ లో ఉండడం వల్ల ఈ కాంట్రాక్టులలో చేర్చే అవకాశం ఉంది.
స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (నాలుగు వన్డేలు, 18 టీ20లు) కూడా ఈ లిస్ట్‌లోకి రానున్నారు. అలాగే, ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కి కూడా చోటు లభించనుంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు A+ గ్రేడ్‌లో కొనసాగనున్నారు. పెద్దగా మార్పులు జరగకపోవచ్చని, కేవలం రెండు లేదా మూడు పేర్లే మారవచ్చని అంచనా.
ఈ కాంట్రాక్ట్స్ కొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, భారత జట్లకు సంబంధించిన సహాయ సిబ్బందిలో మార్పులపై కూడా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఈ నిర్ణయాలు ఇటీవలే తీసుకున్నట్లు సమాచారం.