IND vs ENG : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ పై సిరీస్ ఓట‌మి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. మేం బాగానే ఆడాం..

రెండో వ‌న్డేలో ఓట‌మి గ‌ల కార‌ణాల‌ను ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ వెల్ల‌డించాడు.

IND vs ENG : మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ పై సిరీస్ ఓట‌మి.. ఇంగ్లాండ్ కెప్టెన్ బ‌ట్ల‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. మేం బాగానే ఆడాం..

After second odi loss against india england captain Jos Buttler comments viral

Updated On : February 10, 2025 / 7:48 AM IST

ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌ను మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ కైవ‌సం చేసుకుంది. క‌టక్ వేదిక‌గా ఆదివారం జ‌రిగిన రెండో వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఓట‌మి అనంత‌రం ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. రోహిత్ శ‌ర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను త‌మ నుంచి దూరం చేశాడ‌న్నాడు. మ‌రో 30 నుంచి 50 ప‌రుగులు చేసుకుంటే మ్యాచ్ ఫ‌లితం మ‌రోలా ఉండే అవ‌కాశం ఉందన్నాడు.

‘రోహిత్ శ‌ర్మ‌కే గెలుపు క్రెడిట్ మొత్తం ద‌క్కుతుంది. అత‌డు చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. గ‌త కొన్నాళ్లుగా వ‌న్డే క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ ఇలాగే ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో మేము బాగానే ఆడాము. స్కోరు బోర్డు పై భారీ ల‌క్ష్యాన్ని ఉంచాల‌ని భావించాం. బ్యాట‌ర్లు ఇంకాస్త రాణించాల్సింది. ఎవ‌రో ఒక‌రు జ‌ట్టు స్కోరును 350 ప‌రుగులకు తీసుకెళ్లాల్సింది. ప‌వ‌ర్ ప్లేలో మేము అద్భుతంగా ఆడాం. ఇక ప్ర‌త్య‌ర్థి కూడా బాగా ఆడింది. ఇక చివ‌ర‌గా ఫ‌లితాలు మ‌న‌కు అనుకూలంగా లేకున్నా స‌రే.. సానుకూల దృక్ప‌థంతో ముందుకు సాగాలి.’ అని జోస్ బ‌ట్ల‌ర్ అన్నాడు.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో సిరీస్ విజయం తరువాత రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. శుభ్‌మ‌న్‌ గిల్, శ్రేయాస్ గురించి మాట్లాడుతూ..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. కీల‌క మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సీనియ‌ర్ ఆట‌గాడు జో రూట్‌ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు), డకెట్‌ (65; 56 బంతుల్లో 10ఫోర్లు), లివింగ్‌స్టన్‌ (41; 32 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్స‌ర్లు) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిల్ సాల్ట్ (26) ల‌కు మంచి ప్రారంభం ల‌భించ‌గా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు తీశాడు. ష‌మీ, రాణా, పాండ్యా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు త‌లా ఓ వికెట్ సాదించారు.

అనంత‌రం రోహిత్‌ శర్మ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంసక‌ర శ‌త‌కంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 44.3 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. శుభ్‌మ‌న్ గిల్ (60; 52 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ‌శ‌త‌కం చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (44; 47 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (41 నాటౌట్‌; 43 బంతుల్లో 4 ఫోర్లు) లు రాణించారు. టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (5) విఫ‌లం అయ్యాడు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జామీ ఓవర్టన్ రెండు వికెట్లు, ఆదిల్ ర‌షీద్‌, లియామ్ లివింగ్ స్టోన్‌, గుస్ అట్కిన్సన్‌ త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs ENG : ఏమ‌య్యా కోహ్లీ ఇది నీకు భావ్య‌మేనా? కుర్రాడికి చోటు లేకుండా చేసి.. సింగిల్ డిజిట్‌కే..

ఈ విజ‌యంతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇక నామ‌మాత్ర‌మైన మూడో వ‌న్డే మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 12 బుధ‌వారం జ‌ర‌గ‌నుంది.