Babar Azam : చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. ఆమ్లా, కోహ్లిల రికార్డు బ్రేక్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 19 శతకాలు బాదిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.

Babar Azam
Babar Azam 19 ODI Hundred : పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ (Babar Azam) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 19 శతకాలు బాదిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ముల్తాన్ వేదికగా ప్రారంభమైన ఆసియా కప్ (Asia Cup) మొదటి మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ పెను విధ్వంసాన్నే సృష్టించాడు. 131 బంతుల్లో 14 ఫోర్లు, 4సిక్సర్లు సాయంతో 151 పరుగులు చేశాడు.
ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
ఈ మ్యాచ్‌లో బాబర్ 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాబర్ కెరీర్‌లో ఇది 19వ వన్డే సెంచరీ. ఇది అతడికి 102వ ఇన్నింగ్స్ మాత్రమే. వన్డే క్రికెట్‌లో ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా ఇంత వేగంగా 19 సెంచరీల మార్క్‌ను అందుకోలేదు. బాబర్ కంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. ఆమ్లా 104 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకోగా భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లి 124, ఏబీ డివిలియర్స్ 171 ఇన్నింగ్స్‌ల్లో 19వ వన్డే సెంచరీ మార్క్‌ను అందుకున్నారు.
తాజా శతకం సాయంతో బాబర్ వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో 15వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్(19)ను సమయం చేశాడు. పాకిస్తాన్ తరుపున అత్యధిక వన్డే శతకాలు బాదిన సయీద్ అన్వర్(20) తరువాతి స్థానంలో నిలిచాడు.