T20 World Cup 2026: బంగ్లాదేశ్ గేమ్ ఓవర్.. దాని ప్లేస్‌లో ఆడే కొత్త టీమ్ ఇదే.. ICC అధికారిక ప్రకటన
టోర్నీలో ఆడతారా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఇచ్చిన అల్టిమేటమ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించకపోవడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
Bangladesh, Scotland Teams (Image Credit To Original Source)
- భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ పట్టు
- బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన ఐసీసీ
- ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచ కప్ 2026
T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంపికైనట్టు ఐసీసీ వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ చాలా రోజులుగా చెబుతున్న విషయం తెలిసిందే. తాము లేవనెత్తిన సమస్యకు ఐసీసీ తగిన స్పందన ఇవ్వలేదని బంగ్లాదేశ్ పేర్కొంది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ఎంపికైనట్టు ఐసీసీ లేఖ ద్వారా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. బంగ్లాదేశ్ అభ్యంతరాలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ శుక్రవారం దుబాయ్‌లో సమావేశం నిర్వహించింది.
ఆ సమావేశానికి ఐసీసీ ఛైర్మన్ జై షా అధ్యక్షత వహించారు. చివరి ప్రయత్నంగా బంగ్లాదేశ్ ఈ అంశాన్ని వివాద పరిష్కార కమిటీకి పంపాలని ఐసీసీకి లేఖ రాసింది. అయితే ఆ కమిటీ అప్పీల్ వేదికలా పనిచేయలేదని పేర్కొంటూ.. ఐసీసీ తాము తీసుకున్న తుది నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని నిర్ణయించింది.
ఈ పరిస్థితుల్లో.. టోర్నోలో ఆడతారా? లేదా? అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలని తాము ఇచ్చిన అల్టిమేటమ్‌పై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించకపోవడంతో, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో టీ20 ప్రపంచ కప్ 2026 జరగనుంది.
స్కాట్లాండ్‌కు అదృష్టం
ఈ పరిణామంతో స్కాట్లాండ్‌కు మంచి అవకాశం దక్కింది. ఇప్పటివరకు స్కాట్లాండ్ 5 టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొంది. 2022, 2024 ఎడిషన్లలో టోర్నీలో ఆడిన స్కాట్లాండ్.. మంచి పర్ఫార్మన్స్ ఇచ్చినా సూపర్ 8 దశకు చేరలేకపోయింది. 2024 ఎడిషన్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించే ముందు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లను స్కాట్లాండ్ గట్టిగా ఎదుర్కొంది.
ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ప్రత్యామ్నాయంగా ఎంపిక చేశారు. స్కాట్లాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ జట్లతో కలిసి గ్రూప్ సీ లోకి ప్రవేశించనుంది. బంగ్లాదేశ్ స్థానంలో వచ్చిన స్కాట్లాండ్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో ఆడనుంది.
ఫిబ్రవరి 9న ఈడెన్ గార్డెన్స్‌లో ఇటలీతో స్కాట్లాండ్ తలపడుతుంది. అదే వేదికపై ఇంగ్లాండ్‌తోనూ మ్యాచ్ ఆడుతుంది. ఫిబ్రవరి 17న ముంబైలో నేపాల్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడుతుంది.
