MI VS LSG : ముంబై పై ఘోర ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్‌..

అస‌లే ముంబై చేతిలో ఓడిపోయిన బాధ‌లో ఉన్న రిష‌బ్ పంత్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది.

MI VS LSG : ముంబై పై ఘోర ఓట‌మి.. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్‌..

Courtesy BCCI

Updated On : April 28, 2025 / 10:47 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ ప్ర‌యాణం ప‌డుతూ లేస్తూ సాగుతోంది. ఓ మ్యాచ్‌లో గెలిస్తే మ‌రో మ్యాచ్‌లో ఓట‌మి అన్న‌ట్లుగా ఈ జ‌ట్టు ప్ర‌యాణం కొన‌సాగుతోంది. ఇప్పటి వ‌ర‌కు ఆ జ‌ట్టు 10 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉండ‌గా నెట్‌ర‌న్‌రేట్ -0.325గా ఉంది.

ఆదివారం ముంబైలోని వాంఖ‌డే వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 54 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న జ‌ట్టుకు గ‌ట్టి షాక్ తగిలింది. ల‌క్నో కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు రూ.24 ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. అంతేకాదండోయ్ ఆట‌గాళ్ల‌కు సైతం ఫైన్ ప‌డింది.

ముంబైతో మ్యాచ్‌లో ల‌క్నో జ‌ట్టు స్లో ఓవ‌ర్‌ను న‌మోదు చేసింది. నిర్ణీత స‌మ‌యంలో ఓవ‌ర్లు పూర్తి చేయ‌క‌పోవ‌డంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం కెప్టెన్ రిష‌బ్ పంత్‌కు రూ.24 లక్ష‌ల జ‌రిమానా, ఇంపాక్ట్ ప్లేయ‌ర్ స‌హా ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోని మిగిలిన ఆట‌గాళ్ల‌కు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6ల‌క్ష‌లు రెండింటిలో ఏదీ త‌క్కువ అయితే అది ఫైన్‌గా విధించ‌బ‌డింది. అని ఐపీఎల్ నిర్వాహ‌కులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

MI VS LSG : చ‌రిత్ర సృష్టించిన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. ల‌సిత్ మ‌లింగ రికార్డు బ్రేక్‌..

ఈ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్లో ఓవ‌ర్ రేటును న‌మోదు చేయ‌డం ఇది రెండో సారి. తొలిసారి ఈ త‌ప్పిదానికి పంత్‌కు రూ.12ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. ఈ సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు సైతం రెండు సార్లు జ‌రిమానా ప‌డింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 215 ప‌రుగులు సాధించింది. ర్యాన్ రికెల్టన్ (58; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్ (54; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో మ‌యాంక్ యాద‌వ్‌, ఆవేశ్ ఖాన్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ప్రిన్స్ యాద‌వ్, దిగ్వేత్ ర‌తి, ర‌విబిష్ణోయ్‌లు త‌లా ఓ వికెట్ సాధించారు.

DC vs RCB : బెంగ‌ళూరు పై అందుకే ఓడిపోయాం.. ఢిల్లీ కెప్టెన్ అక్ష‌ర్ ప‌టేల్ కామెంట్స్‌.. లేదంటేనా?

అనంత‌రం భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 161 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో ఆయుష్ బ‌దోని (35), మిచెల్ మార్ష్ (34)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. ముంబై బౌల‌ర్ల‌లో బుమ్రా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీశాడు. విల్ జాక్స్ రెండు, కార్బిన్ బాష్ ఓ వికెట్ సాధించాడు.