DC vs RCB : బెంగళూరు పై అందుకే ఓడిపోయాం.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్.. లేదంటేనా?
రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడిపోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ ఇంకాస్త మెరుగ్గా చేయాల్సి ఉందని, ఫీల్డింగ్ తప్పిదాలు తమ కొంపముంచాయని ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ అన్నాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) లు రాణించారు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
IPL 2025: ఇది నా అడ్డా..! కేఎల్ రాహుల్ కు తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్
అనంతరం కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్ ), విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో లక్ష్యాన్ని బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ సీజన్‌లో బెంగళూరు ఇది ఏడో విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో బెంగళూరు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఓడిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో స్థానానికి పడిపోయింది.
కాగా.. ఆర్‌సీబీ చేతిలో ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. బ్యాటింగ్‌లో తాము 10 నుంచి 15 పరుగులు తక్కువగా చేశామని చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కొంచెం కఠినంగా ఉందన్నాడు. అయితే.. మంచు ప్రభావంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయిందన్నాడు. గత మ్యాచ్‌లకు భిన్నంగా ఏమీ చేయలేదని, అదే ఇంటెంట్‌తో ఆడినట్లుగా చెప్పుకొచ్చాడు.
వరుస వికెట్లు కోల్పోవడంతో తాము అనుకున్న స్కోరును సాధించికలేకపోయినట్లుగా తెలిపాడు. ఈ పిచ్ పై మొదటగా నిలదొక్కుకుంటే ఆ తరువాత ఈజీగా పరుగులు చేయొచ్చునని చెప్పాడు. అలా మా జట్టులోని ఒక్క బ్యాటర్ అయినా ఆడినట్లయితే అదనంగా మేము మరో 10 నుంచి 15 పరుగులు చేసేవాళ్లం. అని అక్షర్ పటేల్ అన్నాడు.
IPL 2025: మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య గొడవ.. అసలేం జరిగిందంటే..? వీడియో వైరల్
ఇక బ్యాటింగ్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్‌ను ముందు పంపడం పై కూడా అక్షర్ మాట్లాడాడు. ‘ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక మైదానంలోని ఓ వైపు బౌండరీ చాలా చిన్నగా ఉంటుంది. దీంతో రాహుల్‌ను నంబర్ 4 పంపాము. అందుకనే నేను 5వ స్థానంలో బరిలోకి దిగాను. ఇక ఫీల్డింగ్‌లో మేము కొన్ని క్యాచ్‌లను మిస్ చేశాం. అవి ఆమోదయోగ్యం కాదు.’ అని అక్షర్ అన్నాడు.