కోటి రూపాయలు, బీఎండబ్ల్యూ కారు.. హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ బంపర్ ఆఫర్

HCA: హైదరాబాద్‌ జట్టుకు ఇప్పటికే రూ.10 లక్షల నజరానాను కూడా ప్రకటించారు.

కోటి రూపాయలు, బీఎండబ్ల్యూ కారు.. హైదరాబాద్ జట్టుకు హెచ్‌సీఏ బంపర్ ఆఫర్

Hyderabad Cricket Association

Updated On : February 20, 2024 / 6:05 PM IST

Hyderabad Cricket Association: రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్‌ జట్టుపై హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వరాల జల్లు కురిపించారు. హైదరాబాద్‌ జట్టుకు రూ.10 లక్షల నజరానా ప్రకటించారు. వ్యక్తిగతంగా ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కెప్టెన్‌ తిలక్‌వర్మ, ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌, స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌, ఫైనల్లో సెంచరీలు సాధించిన నితిశ్‌ రెడ్డి, ప్రజ్ఞయ్‌ రెడ్డికి తలో రూ.50 వేలు ప్రత్యేక నగదు బహుమతిని అందిస్తామన్నారు.

ఉప్పల్ స్టేడియంలో మంగళవారం ముగిసిన రంజీ ట్రోఫీ ప్లేట్ ఫైనల్లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో మేఘాలయను ఓడించింది. అనంతరం జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ వచ్చే ఏడాది రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ కు అర్హత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వచ్చే 2-3 ఏళ్లలో రంజీ ఎలైట్ ట్రోఫీ గెలిస్తే జట్టుకు రూ. కోటి, జట్టులోని ప్రతి ఆటగాడికి బీఎండబ్ల్యూ కారు ఇస్తామని జగన్‌మోహన్‌ రావు బంపరాఫర్ ఇచ్చారు.

హైదరాబాద్ జట్టు ప్లేట్ నుంచి ఎలైట్ గ్రూప్ చేరుకోవడంతో నిర్దేశిత లక్ష్యం పూర్తయిందని అన్నారు. వచ్చే సీజన్ లో ఎలైట్ గ్రూప్ లో జట్టు సత్తా చాటాలని ఆకాంక్షించారు. రాబోయే మూడేళ్లలో హైదరాబాద్ రంజీ ట్రోఫీ చాంపియన్ గా నిలవాలన్నారు. ఇందుకు హెచ్ సీ ఏ తరఫున జట్టుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జగన్‌మోహన్‌ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధ్యక్షుడి సహకారం అమోఘం: హైదరాబాద్ కెప్టెన్‌
రంజీ ట్రోఫీ (ఎలైట్‌) విజయం సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నజరానా, ఆటగాళ్లకు ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కారు బహుమానంగా ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు ప్రకటించటం సంతోషంగా ఉందని హైదరాబాద్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ అన్నాడు.

‘వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఆటనే ప్రధానం. ప్రతి మ్యాచ్‌లో విజయం కోసమే పోరాడుతాం. గెలుపు తప్ప మరో ధ్యాస ఉండదు. రానున్న రెండు సీజన్లలో హైదరాబాద్‌ను రంజీ ట్రోఫీ విజేతగా నిలపటమే లక్ష్యం. కానీ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి సైతం ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి, కార్లు అందిస్తామని ప్రకటించటం బాగుంది. ఆటగాళ్లకు ఇది మరింత ఉత్సాహం ఇస్తుందని’ తిలక్‌ వర్మ అన్నాడు.

Read Also: తండ్రి తిట్టినా.. భార్యను వెనకేసుకొస్తున్న రవీంద్ర జడేజా.. తన సక్సెస్‌కి ఆమె కారణమట!