G Trisha: యువ సంచలనం త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
యువ సంచలనం త్రిష పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది.

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే, ధ్రుతి, నూషీన్, షాలినీకి తలో రూ.10 లక్షలు ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్‌గా తెలంగాణకు చెందిన ధ్రుతి కేసరిగా ఉన్న విషయం తెలిసిందే. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ పేరే నౌషీన్. ట్రైనర్ పేరు షాలిని.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొంగడి త్రిష మర్యాద పూర్వకంగా కలిసింది. అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిషను రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో దేశం తరఫున మరింతగా రాణించాలని అన్నారు.
రేవంత్ రెడ్డిని త్రిష కలిసి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు ఉన్నారు.
కాగా, అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో త్రిష మొత్తం 309 పరుగులు చేసి సత్తా చాటింది. అంతేగాక, బౌలింగ్‌లోనూ రాణించి 7 వికెట్లు తీసింది. టోర్నీలో నమోదైన ఏకైక శతకం త్రిషదే. ఆమె సొంత ప్రాంతం తెలంగాణలోని భద్రాచలం. చిన్నప్పటి నుంచే ఆమె క్రికెట్‌లో సత్తా చాటుతోంది. తొమ్మిదేళ్ల వయసులో హైదరాబాద్ అండర్-16 జట్టులోనూ ఆడింది. అండర్-23 కేటగిరీలోనూ ఆడుతోంది. తనకు మిథాలీ రాజ్ స్ఫూర్తి అని ఆమె పలుసార్లు చెప్పింది.