PBKS vs CSK : వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై ఓటమి.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ కామెంట్స్ వైరల్.. మేం ఎందుకు ఓడిపోతున్నామంటే..?
వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం పై చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిపోయింది. మంగళవారం పంజాబ్ కింగ్స్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. మరోసారి ఫీల్డింగ్ వైఫల్యమే తమ కొంప ముంచిందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గ్వైకాడ్ తెలిపాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ తమ ఫీల్డింగ్ స్థాయికి తగ్గట్లుగా లేదని అంగీకరించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య (103; 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేయగా, శశాంక్ సింగ్ (52 నాటౌట్; 36 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో అలరించాడు. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఆ తరువాత డెవాన్ కాన్వే (69; 49 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు), రచిన్ రవీంద్ర (36; 23 బంతుల్లో 6ఫోర్లు),శివమ్ దూబె (42; 27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (27; 12 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించినా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు తీశాడు. గ్లెన్ మాక్స్‌వెల్, యశ్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఓటములకు కారణమదే..?
పంజాబ్ పై ఓటమి అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఫీల్డింగ్ వైఫల్యం కారణంగానే ఓడిపోయామని చెప్పుకొచ్చాడు. మేం క్యాచ్‌లు వదిలివేసిన బ్యాటర్లు 15, 20, 30 పరుగులు అదనంగా చేశారు. బెంగళూరుతో మ్యాచ్ కాకుండా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి లేదా రెండు లేదా మూడు భారీ షాట్ల దూరంతోనే మ్యాచ్‌లను ఓడిపోయామని చెప్పాడు.
‘పంజాబ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్యను అభినందించాల్సిందే. అతడు హై రిస్క్‌తో బ్యాటింగ్ చేశాడు. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టినా.. పంజాబ్ బ్యాటర్లు దూకుడు కొనసాగించారు. పంజాబ్‌ను మరో 10 నుంచి 15 పరుగుల తక్కువకు కట్టడి చేసుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.’ అని రుతురాజ్ అన్నాడు.
Hardik Pandya : టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారత ఆటగాడు..
ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటింగ్ తీరు బాగుందన్నాడు. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలు మంచి ఓపెనింగ్ జోడి. ఈ ఇద్దరు పేస్ బౌలింగ్‌ను చాలా చక్కగా ఆడతారు కాబట్టే వారిని ఓపెనర్లుగా పంపాము. ఈ మ్యాచ్‌లో కాన్వే చక్కగా బ్యాటింగ్ చేశాడు.
కాన్వే ఎక్కువ సేపు క్రీజులో ఉన్నాడు. అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు అనే విషయం మీకు తెలుసు. జడేజా ఫినిషర్ రోల్‌ను పోషించగలడని భావించి కాన్వేను రిటైర్డ్ కమ్మని చెప్పాము. ఇక ప్లేయర్లకు ఒకటే చెప్పాను ఫీల్డింగ్‌ను ఆస్వాదించాలని సూచించాను. మీరు భయపడితే.. క్యాచ్‌ను వదిలివేస్తారు. కాబట్టి కంగారు పడొద్దని చెప్పాను. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా ఎన్నో సానుకూలతలు ఉన్నాయి అని రుతురాజ్ తెలిపాడు.