Ravichandran Ashwin : అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ఖతం.. చివరి మ్యాచ్ ఆడేశాడా?
ఐపీఎల్‌లో అశ్విన్ కెరీర్ ముగిసినట్లేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Courtesy BCCI
టీమ్ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ మెగావేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని రూ.9.75 కోట్లకు కొనుగోలు చేసింది. తన సొంత మైదానం అయిన చెపాక్‌లో అశ్విన్ మెరుపులు మెరిపిస్తాడని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడని అంతా భావించారు.
అయితే.. అశ్విన్ తన స్థాయికి తగ్గట్లుగా ఆడడంలో విఫలం అవుతున్నాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ ఐదు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. పవర్ ప్లేలోనే (తొలి ఆరు ఓవర్లు)లోనే రెండు ఓవర్లు వేస్తుండడంతో.. బ్యాటర్లు ఈజీగా అతడి బౌలింగ్‌లో పరుగులు రాబడుతున్నారు. అటు బ్యాటింగ్‌లోనే ఇబ్బంది పడుతున్నాడు.
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన సీఎస్‌కు ఈ మ్యాచ్‌లో గెలవడం కాస్త ఊరట నిచ్చే అంశం. అయితే.. ఈ మ్యాచ్ తుది జట్టులో అశ్విన్ కు చోటు దక్కలేదు. దీని గురించి ఎంఎస్ ధోని మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ఇక ముగిసినట్లేనని చెబుతున్నారు.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. అశ్విన్ పై జట్టు చాలా ఒత్తిడి తీసుకువస్తోందన్నాడు. అతడిని మొదటి ఆరు ఓవర్లలో రెండు ఓవర్లు బౌలింగ్ చేయిస్తున్నాము అని చెప్పుకొచ్చాడు. పవర్ ప్లేలో మెరుగైన బౌలింగ్ ఆప్షన్లు కావాలని భావించే ఈ మ్యాచ్‌లో మార్పులు చేశామని వెల్లడించాడు. ఇది మెరుగైన బౌలింగ్ యూనిట్ అని ధోని అభిప్రాయపడ్డాడు.
అంటే ధోని మాటలను బట్టి చూస్తే తదుపరి మ్యాచ్‌ల్లో అశ్విన్‌కు చోటు దక్కడం కష్టం. లక్నోతో మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, మతీషా పతిరానాలతో కూడిన బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రాణించింది.