కేఎల్ రాహుల్ చిన్నప్పటి నుంచి ఇంతే..: కోచ్ శామ్యూల్ జయరాజ్

"అందుకే ఇప్పుడు అతడు మెంటల్లీ, టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు" అని కోచ్ శామ్యూల్ జయరాజ్ చెప్పారు.

కేఎల్ రాహుల్ చిన్నప్పటి నుంచి ఇంతే..: కోచ్ శామ్యూల్ జయరాజ్

KL Rahul

Updated On : June 8, 2025 / 5:02 PM IST

ఇంగ్లాండ్ ల‌య‌న్స్‌తో జ‌రిగిన రెండో అన‌ధికార టెస్టు మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ 116 పరుగులు బాదిన విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ మధ్య టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్‌ ఫామ్‌లో ఉండడం శుభపరిణామం.

దీనిపై కేఎల్‌ రాహుల్‌ చిన్ననాటి కోచ్‌ శామ్యూల్ జయరాజ్ మాట్లాడుతూ పలు కీలక విషయాలు తెలిపారు. అతడు చిన్నప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడని జయరాజ్ అన్నారు. కేఎల్ రాహుల్ వేర్వేరు బ్యాటింగ్ స్థానాల్లో దిగడానికి బాగా అలవాటు పడ్డాడని అన్నారు. అతడు కోచ్‌ల సూచనలను బాగా పాటిస్తాడని చెప్పారు.

Also Read: ఎవరీ మాధవీలత? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన “చీనాబ్” నిర్మాణం కోసం.. 17 ఏళ్ల పాటు కృషి చేసిన తెలుగు మహిళ

“ఒక కోచ్‌గా చెబుతున్నాను. బాగా పర్ఫార్మ్‌ చేయడానికి కేఎల్ రాహుల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. అతడు ఓ వికెట్‌ కీపర్ కూడా. బ్యాటింగ్ వ్యూహాలను అమలు చేస్తాడు. స్ట్రైక్‌ని చాలా తెలివిగా రొటేట్ చేస్తాడు. ఓవర్‌లోని నాలుగు, ఐదు లేదా ఆరో బాల్‌కి సింగిల్స్‌ తీయగలడు. ఆ తదుపరి ఓవర్‌ను ఎదుర్కోగలుగుతాడు. కోచ్ సూచనలను చాలా బాగా పాటిస్తాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అతడు టీమ్‌లో ఓ ప్రత్యేక పాత్రను పోషించాడు. ప్రణాళిక ప్రకారం ఆడాడు” అని శామ్యూల్ జయరాజ్ చెప్పారు.

“నిజానికి వన్డే ప్రపంచ కప్‌లో బాగా ఆడినప్పటికీ అతడిని టీ 20 ప్రపంచ కప్‌కు ఎంపిక చేయలేదు. అయినప్పటికీ కేఎల్ రాహుల్ నిరాశ చెందలేదు. ఎందుకంటే, అటువంటి పరిస్థితులను కేఎల్ రాహుల్ చిన్నప్పటి నుంచీ ఎదుర్కొంటూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు అతడు మెంటల్లీ, టెక్నికల్లీ స్ట్రాంగ్‌గా ఉన్నాడు.

ఇదే అతడి బలం. అతను చాలా పరిణతి చెందాడు. అతను 10 సంవత్సరాలుగా హైలెవల్‌ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ అనుభవం అంతగా ఇప్పుడు అతడి ఆటతీరులో కనపడుతోంది. అతను ఇప్పుడు పూర్తిగా భిన్నమైన ఆటగాడు. చాలా ప్రశాంతంగా, పూర్తిగా నిగ్రహంతో ఉంటున్నాడు” అని కోచ్ శామ్యూల్ జయరాజ్ చెప్పారు.