డే నైట్ కు గ్రీన్ సిగ్నల్ : భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త ఇన్నింగ్స్
టెస్ట్ మ్యాచ్ అంటే.. ఇన్నాళ్లు పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్

టెస్ట్ మ్యాచ్ అంటే.. ఇన్నాళ్లు పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్
టెస్ట్ మ్యాచ్.. ఇన్నాళ్లూ పగటి పూటే చూశాము. ఎంజాయ్ చేశాము. కానీ.. ఇకపై రాత్రి కూడా చూడొచ్చు. అవును.. భారత్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఇటు బీసీసీఐ, అటు బీసీబీ.. రెండూ ఓకే చెప్పాయి. దీంతో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొత్త ఇన్నింగ్స్ చూడబోతున్నాము.
నవంబర్ లో తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సొంత నగరం కోల్‌కతాలోని విఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదిక కానుండటం విశేషం. డే నైట్ టెస్ట్ ఆడాలనేది గంగూలీ ఆలోచన. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గంగూలీ ముందుగా దీనిపై ఫోకస్ పెట్టాడు. గంగూలీ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. భారత్‌తో డే నైట్ టెస్టు ఆడేందుకు తాము సిద్ధమేనని ప్రకటించింది. నవంబర్ లో భారత్, బంగ్లాదేశ్ ఖాతాలో తొలి డే నైట్ టెస్టు చేరనుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, జింబాబ్వే జట్లు ఎప్పుడో డే నైట్ టెస్టులు ఆడేశాయి. కానీ టెస్టుల్లో నంబర్ వన్ జట్టు భారత్ మాత్రం ఇప్పటిదాకా ఫ్లడ్‌లైట్ల మధ్య ఐదు రోజుల ఆట ఆడలేదు. ఇప్పుడు టీమిండియా కూడా రూటు మార్చుకుంది. డే నైట్‌కు సై అంది. నవంబర్ లో భారత గడ్డపై కోహ్లి సేన ఆడే డే నైట్ టెస్టును ఎంచక్కా చూసేయొచ్చు. ఇదంతా బీసీసీఐ కొత్త అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సంకల్పం వల్లే సాకారమవుతోంది.
గంగూలీ 9 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటాడు. అందుకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే కోహ్లిని ‘పింక్‌బాల్ క్రికెట్’కు ఒప్పించాడట. ఆ వెంటనే బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)తోనూ సంప్రదింపులు జరిపి సక్సెస్ అయ్యాడు.
భారత క్రికెట్‌లో ఈడెన్ గార్డెన్స్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ చరిత్రలో మరో పేజీ పింక్‌బాల్‌తో జత కాబోతోంది. నవంబర్ 22 నుంచి 26 వరకు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్‌కతాలో జరిగే రెండో టెస్టును ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పింక్‌బాల్‌తో నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ‘బీసీబీ పింక్‌బాల్ టెస్టుకు అంగీకరించింది. ఇది సానుకూల పరిణామం. టెస్టు క్రికెట్‌కు అవసరమైన మార్పు ఇది. నేను, నా బృందం ఇలాంటి ఆట కోసం పరితపించాం. కొత్త తరహా టెస్టుకు సై అన్న కెప్టెన్ కోహ్లికి కూడా థ్యాంక్స్’ అని గంగూలీ అన్నాడు.
నిజానికి చాన్నాళ్ల క్రితమే దేశవాళీ క్రికెట్‌లో పింక్‌బాల్ క్రికెట్ ఆడించాలని అప్పటి క్రికెట్ కమిటీ చైర్మన్ అయిన గంగూలీ సిఫార్సు చేశాడు. గంగూలీ ప్రతిపాదన వల్లే దులీప్ ట్రోఫీలో వరుసగా 2016–17, 2017–18, 2018–19 మూడు సీజన్లు డేనైట్ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించారు. కానీ ఈ సీజన్‌లో మళ్లీ పాత పద్ధతినే అవలంభించి ఎర్ర బంతితో మ్యాచ్‌లను నిర్వహించారు.
కోల్‌కతా డే నైట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆట మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది. ఈడెన్ లో 68 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. టికెట్ల ధరను కనిష్టంగా రూ. 50 నుంచి విక్రయిస్తామని ‘క్యాబ్’ సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. డే నైట్ టెస్టు ముచ్చట ఇప్పటిది కాదు. నాలుగేళ్ల క్రితమే 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య పింక్‌బాల్ మ్యాచ్ జరిగింది. కానీ ఈ నాలుగేళ్లలో కేవలం 11 మ్యాచ్‌లే జరిగాయి. ఈ మ్యాచ్ ఫలితాలు కూడా వచ్చాయి.