IPL Mini Auction : ఈసారి RCB నుంచి ఈ నలుగురు ఔట్.. రిలీజ్ చేసేయడం ఖాయం?
ఐపీఎల్ 2026 వేలానికి ఈ నలుగురు ఆటగాళ్లను ఆర్‌సీబీ (RCB ) వదిలివేసే అవకాశాలు ఉన్నాయి.

From Mayank Agarwal to Liam Livingstone RCB Might Release these players Before IPL 2026 Auction
RCB : ఎన్నో ఏళ్ల పాటు అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అందుకుంది. జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో వారి 17 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణకు తెరపడింది.
ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నప్పటికి కూడా ఆర్‌సీబీ (RCB) ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు జరగనున్న వేలానికి కొంత మంది ఆటగాళ్లను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లో రాణించని ఆటగాళ్ల స్థానంలో కొత్త వారిని తీసుకోని మరోసారి కప్పును ముద్దాడాలని ఆర్‌సీబీ భావిస్తుంది.
ముఖ్యంగా ఓ నలుగురు ఆటగాళ్లను ఆర్‌సీబీ వేలానికి విడుదల చేసే ఛాన్స్ ఉంది.
మయాంక్ అగర్వాల్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో దేవదత్ పడిక్కల్ గాయపడడంతో ఆర్‌సీబీ మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకుంది. పడిక్కల్ గాయపడడానికి ముందు ఈ సీజన్‌లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో 247 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థశతకాలు ఉన్నాయి.
CSK : ఎందుకు తొందర.. మేము చెబుతాముగా.. సోషల్ మీడియాలో సీఎస్‌కే పోస్ట్..
ఇక పడిక్కల్ స్థానంలో బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. 31.66 సగటు, 148.43 స్ట్రైక్‌రేటుతో 94 పరుగులు చేశాడు. గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ 2026 సీజన్‌లో దేవదత్ పడిక్కల్ ఆడడం గ్యారెంటీ. ఈ క్రమంలో మయాంక్‌ను ఆర్‌సీబీ వేలంలోకి విడుదల చేయవచ్చు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మయాంక్ అగర్వాల్ 131 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు 22.96 సగటు, 133.52 స్ట్రైక్ రేట్‌తో 2756 పరుగులు చేశాడు.
లుంగి ఎంగిడి..
ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేస్ ప్రైస్ రూ కోటి వద్దనే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ లుంగి ఎంగిడి ని దక్కించుకుంది ఆర్‌సీబీ. ఐపీఎల్ 2025 సీజన్‌లో ఎంగిడిని ఆర్‌సీబీ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే ఆడించింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయపడడంతోనే ఎంగిడికి ఆ రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్‌ల్లో ఎంగిడి 10.12 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడిని వేలానికి విడుదల చేయవచ్చు. ఇప్పటి వరకు 16 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ సఫారీ పేసర్ 8.53 ఎకానమీతో 29 వికెట్లు పడగొట్టాడు.
లియామ్ లివింగ్ స్టోన్..
ఐపీఎల్ 2025 మెగావేలంలో ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్ ఆర్‌సీబీ రూ.8.75 కోట్లకు దక్కించుకుంది. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు అంచనాలను అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్‌ల్లో 16 సగటుతో 112 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. పేలవ ఫామ్ కారణంగా అతడిని సీజన్ మధ్యలోనే తుది జట్టు నుంచి తప్పించారు. అయితే.. టిమ్ డేవిడ్ గాయపడడంతో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆడాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన లివింగ్ స్టోన్‌ను విడుదల చేసి అతడి స్థానంలో ఐపీఎల్ 2026 వేలంలో వేరొక ఆల్‌రౌండర్ కోసం ఆర్‌సీబీ ప్రయత్నించవచ్చు. లివింగ్ స్టోన్ ఇప్పటి వరకు 49 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 26.27 సగటు, 158.76 స్ట్రైక్ రేట్‌తో 1051 పరుగులు చేశాడు. 13 వికెట్లు తీశాడు.
రసిఖ్ సలాం దార్..
ఐపీఎల్ 2025 మెగావేలంలో జమ్ము కశ్మీర్ పేసర్ రసిఖ్ సలాం దార్‌ను ఆర్‌సీబీ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే అతడిని ఆడించింది. జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్ వంటి పేసర్లు ఉండడంతో ఈ యువ ఆటగాడికి తుది జట్టులో స్థానం దక్కలేదు. అతడికి అధిక జీతం, తక్కువ ప్రయోజనం దృష్ట్యా ఐపీఎల్ 2026 వేలంలో పర్స్ వాల్యూను పెంచుకునేందుకు అతడిని వేలంలోకి వదిలివేయవచ్చు. ఇప్పటి వరకు రసిఖ్ సలాం దార్ 13 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 40.90 సగటు 10.62 ఎకానమీతో 10 వికెట్లు తీశాడు.