Team India : టీమ్ఇండియా టెస్టు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫిక్స్..! బీసీసీఐ ప్లాన్ ఇదేనా..!
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై పడింది.

Gill As Captain Pant To Be Indias Vice Captain In Test Cricket Report
రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఇప్పుడు అందరి దృష్టి టీమ్ఇండియా తదుపరి టెస్టు కెప్టెన్ ఎవరు అన్న దానిపై పడింది. భారత జట్టు వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఈ సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-2027 సైకిల్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఈ నెలాఖరు కల్లా ఇంగ్లాండ్ సిరీస్‌కు జట్టును ఎంపిక చేయడంతో పాటు కెప్టెన్ ఎవరు అన్న విషయాన్ని బీసీసీఐ వెల్లడించే అవకాశం ఉంది.
ఆంగ్లమీడియాలో వస్తున్న పలు వార్తల ప్రకారం.. ఇప్పటికే కొత్త కెప్టెన్ పై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. యువ రక్తంతో టెస్టు నాయకత్వాన్ని నింపబోతుందట. వైస్ కెప్టెన్‌గా ఉన్న టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా తరచుగా గాయాల బారిన పడుతుండడంతో అతడిని నాయకత్వం బృందం నుంచి తప్పించాలని సెలక్టర్లు డిసైడ్ అయ్యారట.
నివేదిల ప్రకారం.. రోహిత్ శర్మ స్థానంలో శుభ్‌మన్ గిల్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకోవడం లాంఛనమేనని అంటున్నారు. అటు వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బుమ్రాను తప్పించి వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు ఆ బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నప్పటికి.. టెస్టు జట్టులో రెగ్యులర్ సభ్యుడు కావడం, విదేశాల్లో జట్టుకు మధురమైన విజయాలను అందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన జట్టు ఎంపిక వంటి విషయాలను మే 23న మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సదరు కథనాల సారాంశం.
ఇదిలా ఉంటే.. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 20 నుంచి 24 వరకు హెడ్లింగ్లీ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – 2025 జూన్ 20 నుంచి 24 వరకు – హెడ్లింగ్లీ, లీడ్స్
రెండో టెస్టు – 2025 జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్టు – 2025 జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్, లండన్
నాలుగో టెస్టు – 2025 జూలై 23 నుంచి 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
ఐదో టెస్టు – 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – ది ఓవల్, లండన్.