Virat Kohli: గిల్ నువ్వు సూపర్.. భారత్ ఘన విజయంపై విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం..

58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది.

Virat Kohli: గిల్ నువ్వు సూపర్.. భారత్ ఘన విజయంపై విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం..

Updated On : July 6, 2025 / 11:12 PM IST

Virat Kohli: ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో గిల్‌ సేన గెలుపొందింది. భారత క్రికెట్‌ చరిత్రలో టీమిండియాకు ఎడ్జ్‌బాస్టన్‌లో ఇదే తొలి టెస్టు విజయం. ఈ చరిత్రాత్మక విజయంపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ ఎక్స్‌ వేదికగా స్పందించాడు.

“ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌ గొప్ప విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. గిల్ నాయకత్వం బ్రిలియంట్. అటు బ్యాట్‌తో, ఇటు ఫీల్డ్‌లో అదరగొట్టాడు. అందరూ అద్భుతంగా ఆడారు. ఈ పిచ్‌పై బౌలింగ్ చేసిన విధానానికి సిరాజ్, ఆకాశ్ లను ప్రత్యేకంగా అభినందించాలి” అని ప్రశంసల వర్షం కురిపించాడు విరాట్ కోహ్లి.

క్రికెట్ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ సైతం ఎక్స్‌లో రియాక్ట్ అయ్యాడు. “శుభ్‌మన్ గిల్ అండ్‌ టీమ్‌ బ్యాట్‌తో బాల్‌తో అద్భుత ప్రదర్శన చూపింది. ఆకాశ్ దీప్, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ కంటే ఇండియన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ మెురుగ్గా కనిపిస్తోంది. అకాశ్ దీప్, సిరాజ్ రేసుగుర్రాలు. బుమ్రా లేకుండా టీమిండియా గెలిచింది. గిల్ బాధ్యతతో చాలా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు” అని కితాబిచ్చాడు.

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన భారత్.. 58 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఈ మైదానంలో టెస్టు గెలవలేదన్న అపకీర్తిని టీమిండియా చెరిపేసుకుంది. 58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణకు ఈ విజయంతో తెరపడింది. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులో గెలుపుతో పుంజుకుంది. కెప్టెన్ గా గిల్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

608 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. ముఖ్యంగా యువ పేసర్ ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో ఆకాశ్ దీప్ 10 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు 68.1 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌట్ అయింది.

తొలి టెస్ట్ లో పరాజయం తర్వాత కీలక బౌలర్ బుమ్రా లేకుండానే ఇంతటి చారిత్రక విజయం సాధించడం గిల్ సేన ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి.