Henry Olonga: సచిన్ టెండూల్కర్ ప్రత్యర్థి నుండి బోట్ క్లీనర్ వరకు- ఆ ఒక్క పనితో.. ఆ మాజీ క్రికెటర్ జీవితంలో ఊహించని మలుపులు..
నేను జింబాబ్వేకు తిరిగి వెళ్ల లేదు. నా తండ్రిని 20 సంవత్సరాలకు పైగా చూడలేదు. అతనిప్పుడు 80ల మధ్యలో ఉన్నాడు.

Henry Olonga: జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. ఎత్తు పల్లాలు వస్తుంటాయి. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడిపోతాం. ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. కొందరి జీవితాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు సడెన్ గా నేలకు పడిపోవచ్చు. సంపన్నుడు కూడా బికారీగా మారొచ్చు. లైఫ్ అంటే అంతే. జింబాబ్వే మాజీ క్రికెటర్ హెన్నీ ఒలోంగా జీవితంలోనూ ఇదే జరిగింది. అతడు తన లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎన్నో బాధలు పడ్డాడు. బతుకుదెరువు కోసం క్రికెటర్ కాస్త బోట్ క్లీనర్ అయ్యాడు. ఇప్పుడు మ్యూజిక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. దీనింతటికి ఒక్కటే కారణం.. రాబర్ట్ ముగాబే పాలనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడమే అతడి పాలిట శాపమైంది. అతడి జీవితం నాటకీయ మలుపు తిరిగింది.
భారత క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా 1990లలో పెరిగిన వారికి, హెన్రీ ఒలోంగా పేరు.. క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన తీవ్రమైన పోటీని జ్ఞాపకాన్ని తెస్తుంది. 1998లో షార్జాలో జరిగిన కోకా-కోలా కప్ ఫైనల్‌లో, జింబాబ్వే యువ ఫాస్ట్ బౌలర్ ఒలోంగా, సచిన్ టెండూల్కర్ ఆగ్రహాన్ని ఎదుర్కొన్నాడు. 92 బంతుల్లో అజేయంగా 124 పరుగులు చేసి, భారత్‌ను 10 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో ఒలోంగా కేవలం 6 ఓవర్లలోనే 50 పరుగులు ఇచ్చాడు.
ఇదే కాదు.. హెన్రీ ఒలోంగా జీవితం మొత్తం నాటకీయ మలుపులు తిరిగింది. 2003లో, రాబర్ట్ ముగాబే పాలనలో జింబాబ్వేలో “ప్రజాస్వామ్యం మరణించింది” అని నిరసన తెలుపుతూ.. ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా అతను, అతని సహచరుడు ఆండీ ఫ్లవర్ నల్ల చేతి బ్యాండ్‌లను ధరించారు. ఈ ధిక్కార చర్యతో హెన్రీ మరణ బెదిరింపులకు దారితీసింది. దేశం నుంచి బహిష్కరణ ఎదురైంది. జింబాబ్వే నుంచి ఆస్ట్రేలియాకి పారిపోయి అక్కడే స్థిరపడ్డాడు. ఇప్పుడు అతను సంగీత వృత్తిని కొనసాగిస్తున్నాడు. 2019లో “ది వాయిస్”లో కూడా పాల్గొన్నాడు. క్రికెట్ నుండి సంగీతానికి ఒలోంగా ప్రయాణం చాలా మంది ఊహించినంతగా అంతగా ఆనందదాయకంగా లేదు. గత దశాబ్దంలో అతని జీవితం పెద్ద మలుపు తీసుకుంది.
Also Read: అవి భారత్‌లో తయారైతే 25శాతం టారిఫ్ చెల్లించాల్సిందే.. మరోసారి యాపిల్‌కు ట్రంప్ వార్నింగ్..
2000 సంవత్సరం ప్రారంభంలో తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు దేశం నుండి బహిష్కరించబడటానికి ముందు జింబాబ్వే క్రికెటర్‌గా ఉన్న సమయంలో రికార్డ్ చేసిన పాటను పాడి వినిపించాడు హెన్రీ. ‘నేను సుదూర సరిహద్దులకు వెళ్ళినా, నా ఆత్మ దీని కోసం, నా ఇల్లు కోసం ఆరాటపడుతుంది. ఎందుకంటే సమయం, స్థలం మనల్ని వేరు చేయవచ్చు. అయినప్పటికీ అది నా హృదయాన్ని ఒంటరిగా ఉంచుతుంది. మనమందరం మన దేశాన్ని నిర్మించడానికి నిలబడినప్పుడు, ఇది మన భూమి, మన జింబాబ్వే’ అని ఒలోంగా గుర్తు చేసుకున్నాడు.
“అక్షరాలా ఆ పాటలోని కొన్ని పదాలు… నా జీవితం ఇప్పుడు ఎక్కడ ఉందో మాట్లాడతాయి. నేను మళ్ళీ పాట విన్నప్పుడు, అది కొంత ఉత్తేజకరంగా ఉంటుంది. నేను జింబాబ్వేకు తిరిగి వెళ్ల లేదు. నా తండ్రిని 20 సంవత్సరాలకు పైగా చూడలేదు. అతనిప్పుడు 80ల మధ్యలో ఉన్నాడు. ఇప్పటికీ బులవాయోలో నివసిస్తున్నాడు” అని హెన్రీ తెలిపాడు. తన YouTube ఛానెల్‌లో సంగీతాన్ని విడుదల చేస్తాడు హెన్నీ ఒలోంగా.
నా సంగీతం గురించి నాకు అహంకారం లేదు. నేను గ్రామాలలో పాడతాను, పాఠశాల పిల్లలకు పాడాను, ముగ్గురు వ్యక్తుల ముందు చిన్న బార్లలో పాడాను. నాకు పాడటం అంటే చాలా ఇష్టం. నాకు ప్రదర్శన ఇవ్వడం చాలా ఇష్టం. నేను అన్ని రకాల పనులు చేశాను. ప్రజల పడవలను శుభ్రం చేశాను. నా జీవితం నిజాయితీగా ఉంది. నేను ఇబ్బందులకు దూరంగా ఉన్నాను” అని ఒలోంగా తెలిపాడు.
2019లో ముగాబే మరణించాడు. దాంతో తిరిగి జింబాబ్వేకు వెళ్లేందుకు హెన్రీకి అవకాశం వచ్చింది. కానీ, అతడు వెళ్లలేదు. ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. “నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. నేనిప్పుడు పాశ్చాత్యుడిని అనుకుంటున్నా. అడిలైడ్‌లో నివసిస్తున్నాను, ఇక్కడ అన్నీ కరెక్ట్ గా జరుగుతున్నాయి” అని హెన్నీ ఒలోంగా చెప్పాడు.