IND vs PAK: ఇండియా vs పాక్ మ్యాచ్ లో పూనకాలేనా? విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు చూస్తే.. ఇప్పటికీ అదే హయ్యస్ట్..
ఈసారి విరాట్ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో అందరి చూపు రన్ మెషిన్ విరాట్ కోహ్లీపైనే ఉంది. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే.. కోహ్లీ రెచ్చిపోతాడు. పాక్ అంటే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. పరుగుల వరద పారిస్తాడు. గత రికార్డులు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 2012లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 183 పరుగులు బాదాడు. విరాట్ కెరీర్ లోనే ఇది హయ్యస్ట్ స్కోర్. ఇక, 2015 వరల్డ్ కప్ లోనూ అదే దూకుడు చూపించాడు. పాకిస్తాన్ పై సెంచరీతో కదం తొక్కాడు. ఇలా పాకిస్తాన్ పై విరాట్ కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
తాజాగా ఛాంపియన్స్ లో ట్రోఫీలో మరోసారి చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ జరగనుంది. ఈసారి విరాట్ ఏ రేంజ్ లో చెలరేగిపోతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, కోహ్లీ ఫామ్ లో లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో పాకిస్తాన్ లో జరిగిన మ్యాచులలో విరాట్ ఏ విధంగా చెలరేగాడో ఒకసారి పరిశీలిస్తే…
2009 నుంచి 2023 వరకు పాకిస్తాన్ తో 16 మ్యాచుల్లో విరాట్ తలపడ్డాడు. పరుగుల వరద పారించాడు. ఏకంగా 678 రన్స్ స్కోర్ చేశాడు. యావరేజ్ 52.15. స్ట్రైక్ రేట్ 100.29.
16 మ్యాచుల్లో 16 ఇన్నింగ్స్ లో 678 రన్స్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇక అతడి హయ్యస్ట్ స్కోర్ 183 పరుగులు. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరిసారిగా 2023 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో విరాట్ తలపడ్డాడు. ఆ మ్యాచ్ లో 18 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ విధించిన 192 పరుగుల టార్గెట్ ను భారత్ 30.3 ఓవర్లలో ఛేజ్ చేసింది.
ఫామ్ లేక కోహ్లీ తంటాలు పడుతున్నాడు. బంగ్లాతో మ్యాచ్ లో 38 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ సందర్భంగా.. విరాట్ కోహ్లీ నెట్స్ లో బాగా ప్రాక్టీస్ చేశాడు. అందరి కంటే 3 గంటలు ముందే వచ్చి ప్రాక్టీస్ చేశాడు. వరుణ్ చక్రవర్తితో కలిసి షెడ్యూల్ చేసిన ప్రాక్టీస్ సమయానికి 3 గంటల ముందుగానే గ్రౌండ్ కి చేరుకున్నాడు. పాక్ తో మ్యాచ్ లో రాణించాలని కసిగా ఉన్న విరాట్ అందుకు అనుగుణంగా బాగా కష్టపడ్డాడు. పాక్ తో పోరులో గెలిచి సెమీఫైనల్ కు సులభంగా చేరుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Also Read : భారత్‌కు పాక్ పేసర్ వార్నింగ్.. మళ్లీ అదే రిపీట్ అవుతుంది.. కాస్కోండి..
భద్రతా కారణాలతో పాకిస్తాన్ లో పర్యటించేందుకు భారత్ నిరాకరించడంతో.. భారత్ పాక్ మధ్య మ్యాచ్ ని దుబాయ్ లో వేదికగా ప్లాన్ చేశారు. ఈ టోర్నీలో తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ ఘన విజయం సాధించింది. గెలుపు బోణీ కొట్టింది. కాగా, పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాక్ చిత్తుగా ఓడింది. 321 పరుగుల భారీ టార్గెట్ ను చేజ్ చేయలేక చేతులెత్తేసింది.