IND vs AUS : ఓటమి బాధలో ఉన్న టీమ్ఇండియాకు షాక్ ఇచ్చిన ఐసీసీ..
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.

ICC Fines Travis Head And Mohammed Siraj after breaching cricket code of conduct
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి బాధలో ఉన్న భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించింది. అంతేకాకుండా అతడి ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్‌ను కూడా చేర్చింది.
పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిడ్ హెడ్, సిరాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరిగింది. హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ సంబరాలు చేసుకుంటూ బయటికి వెళ్లిపో అంటూ సైగలు చేశాడు. ఈ క్రమంలో మాటల యుద్ధం జరిగింది. దీనిపై ఐసీసీ సీరియస్ అయింది. సిరాజ్, ట్రావిస్ హెడ్ లు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తెలిపింది. వీరిద్దరి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను జోడించింది.
‘సిరాజ్ ICC ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించాడు. దీంతో సిరాజ్‌కు అతడి మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించబడింది. ప్లేయర్స్, ప్లేయర్ సపోర్ట్ పర్సనల్ కోసం ఐసిసి ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ని హెడ్, సిరాజ్ ఇద్దరూ ఉల్లంఘించారు. దీంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వీరిద్దరి ఖాతాల్లో ఒక్కొ డీమెరిట్ పాయింట్‌ను జోడించాం. గత 24 నెలల్లో ఇదే వారిద్దరి మొదటి నేరంగా గుర్తించాం. ‘అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక వీరిద్దరు తాము చేసిన తప్పులను అంగీకరించడంతో పాటు శిక్షను స్వీకరించారు. ఇక దీనిపై ఎలాంటి తదుపరి విచారణ ఉండదు అని పేర్కొంది.
Mohammed Siraj and Travis Head have been penalised following their on-field incident during the second Test in Adelaide 👀 #WTC25 | #AUSvIND | Full details 👇https://t.co/IaRloqCln2
— ICC (@ICC) December 9, 2024