ఐసీసీ బిగ్‌ప్లాన్.. క్రికెట్ అభిమానులకు పండగలాంటి వార్త.. టీ20 ప్రపంచ కప్‌కు 32 జట్లు..!
క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్త క్రీడగా విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కీలక ముందడుగు వేసింది.

T20 World Cup
ICC T20 World Cup: క్రికెట్‌ను ప్రపంచ వ్యాప్త క్రీడగా విస్తరించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో తొలి అడుగు పడింది. 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌లో 32 జట్లను చేర్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే.. ఇది క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఈవెంట్ అవుతుంది. దీంతో ప్రపంచంలోని అనేక కొత్త దేశాలకు మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
సింగపూర్‌లో శనివారం జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ ప్రతిపాదనపై సుదీర్ఘంగా చర్చించారు. 2028లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో 32 జట్లను చేర్చాలని ఐసీసీ యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను ఖరారు చేయడానికి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రోజర్ ట్వోస్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భారతదేశం, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకు చెందిన క్రికెట్ బోర్డుల అధికారులు ఉన్నారు. ఈ కమిటీ 32 జట్లతో టీ20 ప్రపంచ కప్‌ను నిర్వహించే విషయంలో సాధ్యాసాధ్యాలను నివేదిక ద్వారా ఐసీసీకి అందజేయనుంది.
క్రికెట్‌ను ప్రపంచవ్యాప్త క్రీడగా విస్తరించాలన్న ఐసీసీ ప్రయత్నాలకు తాజాగా చర్య కీలక ముందడుగు. ఐసీసీ యొక్క ఈ ప్రతిపాదన క్రికెట్ అభివృద్ధికి ముఖ్యమైనది మాత్రమే కాదు, ఇది ప్రపంచ స్థాయిలో క్రికెట్ క్రీడకు కొత్త గుర్తింపును కూడా ఇస్తుంది. భారతదేశం, శ్రీలంక దేశాల్లో జరిగే 2026 టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఇటలీ అర్హత సాధించింది. దీనితోపాటు అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణ ఐసీసీ దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయేతర క్రికెట్ దేశాలకు అవకాశాలు కల్పించడం ద్వారా క్రికెట్ క్రీడను మరింత విస్తృతం చేయొచ్చునని ఐసీసీ భావిస్తోంది.
2026లో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 55 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మెగా టోర్నీలో జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. దీనితరువాత సూపర్-8, సెమీఫైనల్, ఫైనల్ రౌండ్లు ఉంటాయి. 32 జట్లు పాల్గొనే ఈవెంట్‌లో వేదికలు, హోటల్ వసతి, రవాణా వంటి లాజిస్టికల్ సవాళ్లు ఉంటాయి. ప్రస్తుతం ఐసీసీలో సభ్య దేశాల జట్లతోపాటు అసోసియేట్ జట్లకు టీ20 ప్రపంచ కప్‌లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఐసీసీ తాజా ప్రతిపాదన కార్యరూపందాల్చితే క్రికెట్ అనుబంధ జట్లుకూడా చోటు దక్కించుకోవచ్చు. తద్వారా క్రికెట్ క్రీడ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది.