Nitish Kumar Reddy : ఒక్క సెంచరీ.. 5 రికార్డులు.. తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి ఘనత.. సిక్సర్ల కింగ్..
మెల్‌బోర్న్ వేదికగా నితీష్‌కుమార్ రెడ్డి తొలి శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో అతడు పలు రికార్డులను అందుకున్నాడు.

IND vs AUS 4th test Nitish Kumar Reddy achieved 5 records with his maiden century in test
ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్ రెడ్డి అదరగొడుతున్నాడు. క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ఆదుకుంటున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో శతకంతో చెలరేగాడు. 176 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో నితీష్‌రెడ్డికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే పలు రికార్డులను అతడు తన ఖాతాలో వేసుకున్నాడు.
సిక్సర్ల కింగ్..
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు నితీష్ 8 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా నితీష్ కంటే ముందు 2002-03 యాషెస్ సిరీస్ ఇంగ్లాండ్ ఆటగాడు మైకేల్ వాన్, 2009-10 ఆసీస్ పర్యటనలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్ సైతం 8 సిక్సర్లే బాదారు. నాలుగో టెస్టు మ్యాచ్‌తో పాటు మరో టెస్టు నితీష్ ఆడనున్నాడు. ఈ క్రమంలో గేల్, మైకేల్ వాన్ రికార్డు బద్దలు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
అతిపిన్న వయస్కుడిగా..
టెస్టుల్లో నంబర్ 8 లేదా ఆ తరువాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శతకం బాదిన అతిపిన్న వయస్కుడైన మూడో ప్లేయర్‌గా నితీష్‌కుమార్ రెడ్డి ఘనత సాధించాడు. 21 ఏళ్ల 216 రోజుల వయసులో నితీష్ మెల్‌బోర్న్‌లో శతకంతో చెలరేగాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌కు చెందిన అబుల్ హసన్ (20 ఏళ్ల 108 రోజులు) తొలి స్థానంలో ఉండగా.. భారత మాజీ ఆటగాడు అజయ్ రాత్రా 20 ఏళ్ల 150 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
మూడో ఆటగాడిగా..
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన మూడో భారత ఆటగాడిగా నితీష్ రెడ్డి రికార్డులకు ఎక్కాడు. అతడి కన్నా ముందు సచిన్ టెండూల్కర్ 1992లో సిడ్నీలో 18 ఏళ్ల 256 రోజుల వయసులో, 2019లో రిషబ్ పంత్ 21 ఏళ్ల 92 రోజుల వయసులో సిడ్నీ టెస్టులో సెంచరీలు బాదారు.
ఒకే ఒక్కడు..
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నంబర్ 8 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ గా నితీష్‌రెడ్డి చరిత్ర సృష్టించాడు. అలాగే నంబరు 8 లేదా ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గానూ నితీష్ నిలిచాడు. జెర్రీ అలెగ్జాండర్ (1961), ఆడమ్ పరోర్ (2001), మాట్ ప్రియర్ (2011), యాసిర్ షా (2019) మాత్రమే నితీష్ కంటే ముందు ఈ ఘనత సాధించారు.
Sunil Gavaskar : టెస్టుల్లో తొలి సెంచరీ.. నితీష్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ వార్నింగ్..
కుంబ్లే రికార్డ్ బ్రేక్..
ఆస్ట్రేలియా గడ్డపై నంబరు 8 లేదా ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌గానూ నితీష్ రెడ్డి రికార్డులకు ఎక్కాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు కుంబ్లే పేరిట ఉండేది. 2008లో అడిలైడ్ టెస్టులో కుంబ్లే 87 పరుగులు సాధించాడు.
ఆసీస్ గడ్డపై నంబర్ 8 లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాళ్లు..
నితీష్ కుమార్ రెడ్డి – 105* పరుగులు – మెల్ బోర్న్ (2024)
అనిల్ కుంబ్లే – 87 పరుగులు – అడిలైడ్ (2008)
రవీంద్ర జడేజా – 81 పరుగులు – సిడ్నీ (2019)
కిరణ్ మోరే – 67 పరుగులు – మెల్ బోర్న్(1991)
శార్దూల్ ఠాకూర్ – 67 పరుగులు – బ్రిస్బేన్ (2021)