Sunil Gavaskar : టెస్టుల్లో తొలి సెంచరీ.. నితీష్ కుమార్ రెడ్డికి సునీల్ గవాస్కర్ వార్నింగ్..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ యువ బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరును మెచ్చుకున్నాడు.

Sunil Gavaskar warning for Nitish Reddy after blistering MCG century
Sunil Gavaskar warning : టీమ్ఇండియా నయా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచులో సెంచరీతో చెలరేగాడు. నితీష్ ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఒకటిగా నిలిచిపోతుంది. 21 ఏళ్ల నితీష్ 176 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు.
191 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (50)తో కలిసి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. ఒకానొక సమయంలో నితీష్ సెంచరీ చేయడం పై అనుమానం కలిగింది. వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేరగా మూడు బంతులు మాత్రమే ఆడిన బుమ్రా డకౌట్ అయ్యాడు. అప్పుడు నితీష్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. ఒకే వికెట్ మిగిలి ఉంది. అయితే.. కమిన్స్ బౌలింగ్‌లో ఈ ఓవర్‌లో మిగిలిన మూడు బంతులను సిరాజ్ అద్భుతంగా ఎదుర్కొని వికెట్‌ను కాపాడుకున్నాడు.
ఆ తరువాతి ఓవర్‌లో స్ట్రైకింగ్‌కు వచ్చిన నితీష్.. స్కాట్ బొలాండ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. నితీష్ రెడ్డి సెంచరీ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ యువ బ్యాటర్ ఆటతీరును మెచ్చుకున్నాడు.
టెస్టుల్లో అతడికి ఇదే తొలి సెంచరీ. సమీప భవిష్యత్తులో అతడు మరిన్ని శతకాలు సాధించనున్నాడు. భవిష్యత్తులో అతడి మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తున్నాను. అతడు భవిష్యత్తు భారత స్టార్ క్రికెటర్ అని గవాస్కర్ అన్నారు. అదే సమయంలో ఓ హెచ్చరిక సైతం చేశాడు.
అతడు తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలన్నాడు. భారత క్రికెట్ కారణంగానే నితీష్ ఇక్కడకు వచ్చారని, ఈ సెంచరీతో గర్వం తలకెక్కకూడదన్నారు. నిజాయతీగా ఉంటూ క్రమశిక్షణ పాటిస్తే అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి (105), మహ్మద్ సిరాజ్ (2) క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 116 వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.