IND vs AUS: సిడ్నీ టెస్టులోనూ తీరుమార్చుకోని భారత బ్యాటర్లు.. కోహ్లీకి కలిసొచ్చిన అదృష్టం.. రోహిత్ రియాక్షన్ వైరల్

విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. మొదటి బంతికే ఆస్ట్రేలియా బౌలర్ క్యాచ్ అప్పీల్ చేశాడు. ఆ క్యాచ్ వివాదాస్పదమైంది. భారత్ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ ను..

IND vs AUS: సిడ్నీ టెస్టులోనూ తీరుమార్చుకోని భారత బ్యాటర్లు.. కోహ్లీకి కలిసొచ్చిన అదృష్టం.. రోహిత్ రియాక్షన్ వైరల్

Virat Kohli

Updated On : January 3, 2025 / 8:30 AM IST

IND vs AUS Sydney Test : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ సిడ్నీ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మకు తుదిజట్టులో అవకాశం దక్కలేదు. అయితే, జట్టు వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్ శర్మ కావాలనే విశ్రాంతి పేరుతో పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ కు ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్ తుది జట్టులో చోటు దక్కించుకోగా.. ప్రసిద్ధ్ కృష్ణ కు కూడా తుది జట్టులో అవకాశం దక్కింది. బుమ్రా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. అయితే, గత మూడు టెస్టు మ్యాచ్ లలో భారత బ్యాటింగ్ తీరునే సిడ్నీ టెస్టులోనూ వారు పునరావృతం చేశారు.

Also Read: IND vs AUS: సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మను పక్కకు తప్పించారా.. తప్పుకున్నాడా.. కెప్టెన్ బుమ్రా ఏమన్నాడంటే..?

ముగ్గురు కీలక బ్యాటర్లు ఔట్..
మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ స్కోర్ 11 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (4) మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో సామ్ కొంస్టాస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు. క్రీజులోకి శుభమన్ గిల్ వచ్చాడు. అయితే, మరో ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ (10)సైతం తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో వెబ్ స్టర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 17 పరుగులకే భారత్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత మరో వికెట్ పడకుండా విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. కానీ, లంచ్ బ్రేక్ సమయానికి నిలకడగా ఆడుతున్న శుభమన్ గిల్ (20) నాథన్ లైయన్ బౌలింగ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.అప్పటికి క్రీజులో విరాట్ కోహ్లీ (12), రిషబ్ పంత్ ఉన్నారు.

Also Read: IND vs AUS 5th test : ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు.. జ‌స్‌ప్రీత్ బుమ్రాను ఊరిస్తున్న 52 ఏళ్ల రికార్డు..

కోహ్లీకి కలిసొచ్చింది..
విరాట్ కోహ్లీ నాల్గో స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. మొదటి బంతికే ఆస్ట్రేలియా బౌలర్ క్యాచ్ అప్పీల్ చేశాడు. ఆ క్యాచ్ వివాదాస్పదమైంది. భారత్ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ ను స్కాట్ బోలాండ్ వేశాడు. ఆ ఓవర్లో నాల్గో బంతికి యశస్వీ జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తరువాతి బంతికి విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి బ్యాట్ అంచును తాకుతూ స్లిప్ ఫీల్డింగ్ లోఉన్న స్టీవ్ స్మిత్ వైపు దూసుకెళ్లింది. స్మిత్ ఆ బాల్ ను డైవ్ చేసి అందుకునే ప్రయత్నంలో చేతి వేళ్లపైనుంచి గాల్లోకి విసిరాడు. దీంతో స్లిప్ ఫీల్డింగ్ లో ఉన్న మరో ఫీల్డర్ ఆ బాల్ ను క్యాచ్ తీసుకున్నాడు.

దీంతో ఆస్ట్రేలియా జట్టు సభ్యులు సంబరాల్లో మునిగిపోయారు. గ్రౌండ్ అంపైర్ మాత్రం.. స్మిత్ క్యాచ్ అందుకున్న విధానంపై సంతృప్తి చెందలేదు. దీంతో థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశాడు. రిప్లైలో బంతి మొదట్లో స్టీవ్ స్మిత్ చేతిలో చిక్కుకున్నట్లు కనిపించింది. అయితే, ఇంతలోనే బంతి కొంతభాగం నేలను తాకుతూ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ సహా టీమిండియా సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే, లంచ్ బ్రేక్ తరువాత కోహ్లీ ఔట్ అయ్యాడు. బోలాండ్ వేసి బంతిని (31.3వ ఓవర్) ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. బ్యాట్ ఎడ్జ్ ను తాకిన బంతిని వెబ్ స్టర్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో 72 పరుగుల వద్ద టీమిండియా కోహ్లీ రూపంలో నాల్గో వికెట్ కోల్పోయింది.

Also Read: IND vs AUS 5th Test : ఆసీస్‌తో ఐదో టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్.. గాయంతో స్టార్ పేస‌ర్ ఔట్‌..

రోహిత్ రియాక్షన్ వైరల్..
రోహిత్ శర్మ ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. అయితే, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూంలో రోహిత్ శర్మ రియాక్షన్ వైరల్ అయింది. స్కాట్ బోలాండ్ ఆఫ్ -స్టంప్ లైన్ లో షార్ట్ బాల్ వేశాడు. దానిని కోహ్లీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రయత్నంలో బాల్ స్లిప్ వైపు వెళ్లగానే డ్రెసింగ్ రూమ్ లో కూర్చున్న రోహిత్ శర్మ కుర్చీలోనుంచి లేచి కంగారుగా నిలబడినట్లు కనిపించింది. దీంతో రోహిత్ శర్మపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించేవాడే మంచి కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.