IND vs WI 2nd Test : శతక్కొట్టిన జైస్వాల్.. ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా భారత్..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs WI 2nd Test ) తొలి రోజు ఆట ముగిసింది.

IND vs WI 2nd Test day 1stumps Yashasvi Jaiswal Century india eye on big score
IND vs WI 2nd Test : ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టీమ్ ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( 173 నాటౌట్; 253 బంతుల్లో 22 ఫోర్లు)భారీ శతకంతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. యశస్వితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20) క్రీజులో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (38), యశస్వి జైస్వాల్ లు తొలి గంట విండీస్ బౌలర్లను ఆచితూచి ఆడారు. ఆ తరువాత తమదైన శైలిలో పరుగులు రాబట్టారు. మంచి ఆరంభాన్ని అందుకున్న కేఎల్ రాహుల్ స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఓ భారీ షాట్ కోసం ప్రయత్నించాడు. అయితే.. బంతిని రాహుల్ తప్పుగా అంచనా వేయడంతో అతడు స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. రాహుల్, జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 58 పరుగులు జోడించారు.
IPL 2026 Auction : ఐపీఎల్ వేలానికి డేట్ ఫిక్స్..? నవంబర్ 15 వరకు ఫ్రాంఛైజీలకు డెడ్‌లైన్..!
ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్ (87; 165 బంతుల్లో 12 ఫోర్లు) తో కలిసి జైస్వాల్ విండీస్ బౌలర్లు ఆడుకున్నాడు. వీరిద్దరు మంచి బంతులను గౌరవిస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో జైస్వాల్ తొలుత హాప్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కొద్ది సేపటి తరువాత సాయి సుదర్శన్ కూడా అర్థశతకాన్ని నమోదు చేశాడు.
మరోవైపు అదే ధాటిని కొనసాగిస్తూ జైస్వాల్ 145 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో జైస్వాల్ కు ఇది ఏడో సెంచరీ విశేషం. మరోవైపు టెస్టుల్లో తొలి శతకం దిశగా దూసుకువెలుతున్న సాయి సుదర్శన్‌ను వారికన్ బోల్తా కొట్టించాడు. ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. దీంతో 193 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
సుదర్శన్ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన గిల్ బాధ్యతాయుతంగా ఆడాడు. మరోవైపు తనదైన శైలిలో షాట్లు ఆడుతూ జైస్వాల్ 150 పరుగుల మైలురాయిని దాటేశాడు. గిల్‌తో కలిసి తొలి రోజు మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.