Abhishek Sharma : విఫలమైన అభిషేక్ శర్మ.. గోల్డెన్ డక్.. టీ20ల్లోనే మనోడి ప్రతాపమంతా! వన్డేల్లో తుస్సే..!
ఆస్ట్రేలియా-ఏతో ప్రారంభమైన రెండో అనధికారిక వన్డేలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) విఫలం అయ్యాడు.

India A vs Australia A 2nd Unofficial ODI Abhishek Sharma Golden Duck
Abhishek Sharma : టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లలో ఒకడిగా ఉంటూ వస్తున్నాడు అభిషేక్ శర్మ. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో ఎన్నో మెరుపు ఆరంభాలను అందిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఆసియాకప్ 2025లోనూ సత్తా చాటాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో అభిషేక్ (Abhishek Sharma) 7 మ్యాచ్‌ల్లో 200 స్ట్రైక్‌రేటుతో 314 పరుగులు సాధించి భారత్ కప్పు గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.
టీ20ల్లో టీమ్ఇండియా టాప్ ప్లేయర్లలో ఒకడైనప్పటికి కూడా వన్డేల్లో, టెస్టుల్లో మాత్రం ఇంత వరకు చోటు దక్కించుకోలేకపోతున్నాడు అభిషేక్ శర్మ. ప్రస్తుతం కెరీర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్‌లో రాణించి.. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చోటు దక్కించుకుని, వన్డేల్లో అరంగ్రేటం చేస్తాడని అంతా భావించారు.
Ravindra Jadeja : రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని సిక్సర్ల రికార్డు బ్రేక్..
అయితే.. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లో అతడు విఫలం అయ్యాడు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ వేదికగా ఆస్ట్రేలియా-ఏతో ప్రారంభమైన రెండో అనధికారిక వన్డే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ భారత్-ఏ తరుపున బరిలోకి దిగాడు. తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలోనే మైదానంలో అడుగుపెట్టిన అతడు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
జాక్ ఎడ్వర్డ్స్ బౌలింగ్‌లో సదర్లాండ్ క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొలి బంతికే ఔట్ కావడంతో టీ20లే ఆడతాడా?వన్డేల్లో ఆడలేవా అంటూ నెటిజన్లు అంటున్నారు. టీ20ల్లోలాగా వన్డేల్లో తొలి బంతి నుంచే హిట్టింగ్ చేయాల్సిన పని లేదని, తొలుత కాస్త కుదురుకుని ఆ తరువాత అటాకింగ్ చేయాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
అభిషేక్ శర్మతో పాటు మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (8)లు విఫలం కావడంతో భారత్-ఏ జట్టు 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ (25), రియాన్ పరాగ్ (34)లు ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వీరిద్దరు జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్-ఏ స్కోరు 16 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 75 పరుగులుగా ఉంది.