Handshake Row : అబ్బాయిల వంతు అయిపోయింది.. ఇక ఇప్పుడు అమ్మాయిల వంతు.. పాక్‌తో కరచాలనం చేస్తారా? బీసీసీఐ అధికారి ఏమన్నాడంటే..?
ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ జట్టుతో కరచాలనం చేస్తారా (Handshake Row) లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Devajit Saikia on handshakes with pakistan in womens world cup 2025
Handshake Row : ఆసియా కప్ 2025 సందర్భంగా పాకిస్తాన్ ఆటగాళ్లతో భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం పై ఎంత పెద్ద చర్చ జరిగిందో అందరికి తెలిసిందే. పహల్గాం దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో టీమ్ఇండియా ప్లేయర్లు పాక్ ఆటగాళ్లతో కరచాలనం (Handshake Row) చేయలేదు. ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లు ఇలాగే చేశారు. ఇక ఇప్పుడు మహిళల ప్రపంచకప్ 2025లోనూ భారత మహిళా క్రికెటర్లు ఇదే విధానాన్ని అనుసరించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య ఆదివారం అక్టోబర్ 5న కొలంబో వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో టాస్ వేసేటప్పుడు గానీ, మ్యాచ్ ముగిసిన తరువాత కూడా పాక్ ప్లేయర్లతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన కరచాలనం చేయదని సమాచారం. ఇప్పటికే దీనిపై ప్లేయర్లకు బీసీసీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.
అయితే.. దీనిపై బీసీసీఐ అధికారి దేవజిత్ సైకియాకు ప్రశ్న ఎదురైంది. పురుషుల టీమ్‌లాగానే మహిళల జట్టు కూడా పాక్ జట్టుతో కరచాలనం చేయదా? అని మీడియా అడిగింది. దీనికి దేవజిత్ సైకియా నేరుగా సమాధానం చెప్పలేదు. శత్రు దేశంతో సంబంధాలు అలాగే ఉన్నాయన్నారు. గత వారం రోజుల్లో ఇందులో పెద్దగా ఏ మార్పు లేదన్నారు. ఎంసీసీ నిబంధనలను పాటిస్తామన్నారు. మ్యాచ్ తరువాత కరచాలనం, ఆలింగనం వంటివి ఉంటాయా అంటే తాను మాత్రం ఏమీ చెప్పలేనని అన్నాడు.
పాక్ మ్యాచ్‌లు అన్ని కొలంబో వేదికగానే..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అయినప్పటికి బీసీసీఐ, పీసీబీ ఒప్పందం ప్రకారం ఇరు దేశాల్లో ఈవెంట్లు ఉన్నప్పుడు తటస్థ వేదికపైనే మ్యాచ్ లు ఆడతాయి. ఈ నేపథ్యంలో పాక్ ఆడే మ్యాచ్‌లు అన్నింటికి శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. కొలంబో వేదికగానే పాక్ జట్టు మహిళల వన్డే ప్రపంచకప్ 2025 మ్యాచ్‌లు అన్ని ఆడనుంది. ఒకవేళ పాక్ సెమీస్, ఫైనల్ కు అర్హత సాధిస్తే.. అప్పుడు కూడా మ్యాచ్‌లు కొలంబో వేదికగానే జరుగుతాయి.