Akash Deep: నాన్న, అన్న సడన్ డెత్.. డబ్బుల్లేవు.. అప్పుడు వచ్చిందో ఛాన్స్… ఆకాష్ దీప్ లైఫ్ లో..
ఆకాష్ దీప్‌కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది.

Akash Deep: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 58 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇంగ్లాండ్ గడ్డపై భారత్ చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విజయం ఎట్టకేలకు సాధ్యమైంది. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమిండియా చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఏకంగా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. తద్వారా 58 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
ఈ మైదానంలో టెస్టు గెలవలేదన్న అపకీర్తిని భారత్ చెరిపేసుకుంది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియాకు ఇదే తొలి విజయం. 58 ఏళ్లుగా ఈ గడ్డపై గెలుపు కోసం ఎదురుచూస్తున్న భారత్ నిరీక్షణకు తెరదించటంలో పేసర్ ఆకాశ్ దీప్ పాత్ర ఎనలేనిది. ఆకాశ్ దీప్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించాడు. ఏకంగా 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు.
టీమిండియా గెలుపులో కీ రోల్ ఎవరిది అంటే.. ఆకాశ్ దీప్ దే అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ టెస్టులో ఆకాశ్ దీప్ 10 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి సత్తా చాటాడు. భారత్ చరిత్రాత్మక విజయంతో ఒక్కసారిగా ఆకాశ్ దీప్ పేరు మారుమోగిపోతోంది. అంతా ఆకాశ్ గురించి చర్చించుకుంటున్నారు.
బీహార్‌లోని డెహ్రీలో జన్మించిన ఆకాష్ దీప్‌కు క్రికెట్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, జీవిత లక్ష్యంగా మారింది. ఆర్థిక సంక్షోభం, తండ్రి సోదరుడి ఆకస్మిక మరణం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అతను తన లక్ష్యాన్ని వదులుకోలేదు. బెంగాల్ నుంచి దేశవాళీ క్రికెట్ ఆడుతూ ఆకాష్ తనను తాను నిరూపించుకున్నాడు. 2019లో, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో తన కెరీర్ ని ప్రారంభించాడు. క్రమంగా తనదైన ముద్ర వేశాడు.
2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాశ్ ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. దీని తర్వాత, 2025 వేలంలో అతనికి రూ.8 కోట్లు వచ్చాయి, అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. 2025లోనే అతనికి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అప్పటి నుండి అతని ప్రజాదరణ, ఆదాయం రెండూ విపరీతంగా పెరిగాయి.
ఆకాష్ దీప్ నెట్ వర్త్ దాదాపు రూ.41.4 కోట్లు. అతను ప్రస్తుతం BCCI సెంట్రల్ కాంట్రాక్టులో లేడు. కానీ బెంగాల్ క్రికెట్ బోర్డు, మ్యాచ్ ఫీజుల నుండి సంపాదిస్తున్నాడు. ఇప్పటివరకు ఆకాష్ దీప్ ఐపీఎల్ నుండి రూ.10 కోట్లకు పైగా సంపాదించాడు. 2025 లోనే అతను రూ.8 కోట్ల జీతం అందుకున్నాడు. ఆకాష్ దీప్ కోల్‌కతాలో రూ.2 కోట్ల విలువైన కొత్త ఫ్లాట్ కొన్నాడు. అతనికి మహీంద్రా థార్, కియా సెల్టోస్ వంటి కార్లు ఉన్నాయి. భవిష్యత్తులో BMW లేదా ఆడిని కూడా కొనాలని ప్లాన్ చేస్తున్నాడు.