మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం.. సిరీస్ టీమిండియాకు

  • Published By: sreehari ,Published On : December 8, 2020 / 06:33 PM IST
మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం.. సిరీస్ టీమిండియాకు

Updated On : December 8, 2020 / 9:32 PM IST

India vs Australia 3rd T20I : మూడో టీ20ల సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య జరిగిన ఆఖరి టీ20లో ఆసీస్ విజయం సాధించింది. 12 పరుగుల తేడాతో పర్యాటక జట్టు కోహ్లీసేనపై గెలిచి ఆస్ట్రేలియా పరువు దక్కించుకుంది. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ 2-1తో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడో టీ20లో కూడా అదే దూకుడును ప్రదర్శించి.. సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు చివరివరకు కోహ్లీసేన ప్రయత్నించింది. కానీ, ఆఖరి పోరులో భారత్ పోరాడి ఓడింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. 20 ఓవర్లలో 174 పరుగులకే పరిమితమైంది.



కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 85 పరుగులతో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాట్స్‌మన్‌ ఎవరు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆసీస్‌ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ పరుగులేమి రాకుండానే మాక్సవెల్‌ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లి ఓపెనర్‌ ధవన్‌తో కలిసి రన్‌రేట్‌ పడిపోకుండా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ధవన్‌ (28) పరుగులతో స్వేప్సన్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.
India vs Australia, 3rd T20I
శాంసన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌లు స్వల్ప స్కోరుకే చేతులేత్తేశారు. దీంతో టీమిండియా 100 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం పాండ్యా కోహ్లితో ఆసీస్ కు దడ పుట్టించాడు. కోహ్లి సిక్సర్లు, ఫోర్లతో చెలరేగితే.. పాండ్యా కూడా అదే దూకుడును ప్రదర్శించాడు. ఇరువురు కలిసి 20 పరుగులతో బ్యాటింగ్ ఝళిపించారు. పాండ్యా జంపా బౌలింగ్‌లో అవుట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత కోహ్లి కూడా అండ్రూ టై బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దాంతో టీమిండియా ఓటమికి చేరువైంది.



శార్దూల్‌ ఠాకూర్‌ రెండు సిక్సర్లు బాదినా ఫలితం లేకపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులకే భారత్ పరాజయం పాలైంది. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్వేపన్‌ 3 వికెట్లు, మ్యాక్స్‌వెల్‌, అండ్రూ టై, జంపా, అబాట్‌ తలా వికెట్‌ పడగొట్టారు. అంతకముందు టాస్‌ గెలిచిన కోహ్లీసేన ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆసీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. దీంతో కోహ్లీసేనకు 187పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లలో సుందర్‌ 2, నటరాజన్‌, ఠాకూర్‌లు తలో వికెట్‌ తీసుకున్నారు. డిసెంబర్ 17 నుంచి నాలుగు మ్యాచ్‌‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.