India vs Australia : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. 20 ఏళ్ల నాటి ప‌గ.. అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

IND vs AUS : భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు క‌ప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.

India vs Australia : భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా.. 20 ఏళ్ల నాటి ప‌గ.. అప్పుడు ఏం జ‌రిగిందో తెలుసా..?

India vs Australia

Updated On : November 17, 2023 / 3:28 PM IST

IND vs AUS : వ‌న్డే ప్ర‌పంచక‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డే రెండు జ‌ట్లు ఏవో తెలిసిపోయాయి. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు క‌ప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై-ఓల్టేజ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. కాగా.. భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌డం ఇది రెండోసారి.

టీమ్ఇండియా అలా.. ఆస్ట్రేలియా ఇలా..

ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు దూసుకువ‌చ్చింది. సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌తో క‌లిపి మొత్తం 10 మ్యాచులు ఆడిన భార‌త్ అన్ని మ్యాచుల్లోనూ గెలుపొందింది. అటు ఆస్ట్రేలియా ప్ర‌యాణం మాత్రం ఇందుకు కొంచెం భిన్నంగా ఉంది. ఈ మెగాటోర్నీని రెండు ఓట‌ముల‌తో ఆరంభించిన ఆస్ట్రేలియా ఆ త‌రువాత బ‌లంగా పుంజుకుంది. మిగిలిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజ‌యం సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

Rohit Sharma : స్కూల్ బుక్‌లో రోహిత్ శర్మ పై పాఠ్యాంశం..!

అయితే.. ఈ టోర్నీలో లీగ్ ద‌శ‌లో మొద‌టి మ్యాచ్‌లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (97నాటౌట్‌), విరాట్ కోహ్లీ (85) లు రాణించ‌డంతో ల‌క్ష్యాన్ని భార‌త్ 41.2 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

2003 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఏం జ‌రిగిందంటే..?

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు 2003 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో త‌ల‌ప‌డ్డాయి. ద‌క్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో ఆ మ్యాచ్ జ‌రిగింది. టాస్ గెలిచిన భార‌త్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 359 ప‌రుగులు చేసింది. అప్ప‌టి ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ భార‌త బౌల‌ర్ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించాడు. 121 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాది 140 ప‌రుగులతో అజేయంగా నిలిచాడు. అత‌డికి తోడు మార్టిన్ 88 నాటౌట్‌, ఆడ‌మ్ గిల్‌క్రిస్ట్ 57, మాథ్యూహెడెన్ 37 రాణించ‌డంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. భార‌త బౌల‌ర్లు ఎక్స్‌ట్రాల‌ రూపంలో 37 ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డం గ‌మ‌నార్హం

PM Narendra Modi : ప్రపంచకప్ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..!

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన భార‌త్ 39.2 ఓవ‌ర్ల‌లో 234 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో 125 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓడిపోయింది. భార‌త బ్యాట‌ర్ల‌లో వీరేంద్ర సెహ్వాగ్ 82, రాహుల్ ద్ర‌విడ్ 47 లు రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో భార‌త్‌కు దారుణ ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు.

ఈ మ్యాచ్ త‌రువాత భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచులో మ‌రోసారి త‌ల‌ప‌డ‌లేదు. 20 ఏళ్ల త‌రువాత ఇప్పుడు ఆదివారం అహ్మ‌దాబాద్‌లో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి టీమ్ఇండియా నాటి ప‌రాభ‌వానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని స‌గ‌టు భార‌త అభిమాని కోరుకుంటున్నారు.