IND vs PAK : మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్..
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.

IND vs PAK
క్రికెట్ అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పల్లెకలె వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు.
LIVE NEWS & UPDATES
-
మ్యాచ్ రద్దు.. భారత్, పాకిస్తాన్‌కు చెరో పాయింట్
మ్యాచ్ ఆరంభం నుంచే పలుమార్లు ఆటకు అంతరాయం కలిగించిన వరుణుడు భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత తన ప్రతాపాన్ని చూపించాడు. ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్‌ను ఇచ్చారు.
-
మళ్లీ వర్షం
భారత ఇన్నింగ్స్ ముగిసిన తరువాత మళ్లీ వరుణుడు వచ్చేశాడు. దీంతో పాక్ ఇన్నింగ్స్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.
-
పాకిస్తాన్ లక్ష్యం 267
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్ ముగిసింది. 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాక్ ముందు 267 పరుగుల లక్ష్యం నిలిచింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకాలతో రాణించగా రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(10), విరాట్ కోహ్లి(4), శ్రేయస్ అయ్యర్(14)లు విఫలం అయ్యారు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయగా, నదీమ్ షా, హారిస్ రవూఫ్ చెరో మూడు వికెట్లు తీశారు.
-
స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు.. హార్దిక్, జడేజా, శార్దూల్ ఔట్
టీమ్ఇండియా స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. షహీన్ అఫ్రిది ఒకే (44వ) ఓవర్‌లో హార్థిక్ పాండ్య(87; 90 బంతుల్లో 7ఫోర్లు, 1సిక్స్), రవీంద్ర జడేజా (14; 22 బంతుల్లో 1ఫోర్) లను ఔట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్ మొదటి బంతికి (44.1వ ఓవర్) నదీమ్ షా బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్(3) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 242 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
-
దూకుడు పెంచిన హార్థిక్
హార్దిక్ పాండ్య దూకుడు పెంచాడు. హారిస్ రవూఫ్ వేసిన 40వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. 40 ఓవర్లకు భారత స్కోరు 221/5. హార్ధిక్ పాండ్య(80), రవీంద్ర జడేజా (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్
సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ ( 82; 81 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో (37.3వ ఓవర్) బాబర్ ఆజామ్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత్ 204 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. హార్థిక్ పాండ్య, ఇషాన్ కిషన్‌లు ఐదో వికెట్‌కు 138 పరుగులు జోడించారు.
-
హార్థిక్ అర్థశతకం
ఆఘా సల్మాన్ బౌలింగ్‌లో(33.6వ ఓవర్)లో సింగిల్ తీసి హార్ధిక్ పాండ్య 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 34 ఓవర్లకు భారత స్కోరు 178/4. హార్ధిక్ పాండ్య(50), ఇషాన్ కిషన్ (72) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ అర్థశతకం
షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో(28.2వ ఓవర్‌లో) సింగిల్ తీసి ఇషాన్ కిషన్ 54 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 29 ఓవర్లకు భారత స్కోరు 147 4. ఇషాన్ కిషన్ (55), హార్ధిక్ పాండ్య (37) క్రీజులో ఉన్నారు.
-
సగం ఓవర్లు కంప్లీట్
మొదట్లో తలబడినా టీమ్ఇండియా క్రమంగా కోలుకుంది. 25 ఓవర్లు పూర్తి అయ్యే సరికి స్కోరు 4 వికెట్ల నష్టానికి 127. ఇషాన్ కిషన్ (43), హార్థిక్ పాండ్య (30)లు క్రీజులో ఉన్నారు.
-
నిలకడగా ఆడుతున్న బ్యాటర్లు
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యలు నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ గతి తప్పిన బంతులను బౌండరీలకు తరలిస్తున్నారు. 20ఓవర్లకు భారత స్కోరు 102/4 . ఇషాన్ కిషన్(37), పాండ్య(17) క్రీజులో ఉన్నారు.
-
శుభ్‌మన్ గిల్ క్లీన్ బౌల్డ్
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో(14.1వ ఓవర్) శుభ్‌మన్ గిల్(10; 32 బంతుల్లో 1 ఫోర్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 66 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు భారత స్కోరు 72/4. ఇషాన్ కిషన్(14), పాండ్య(5) క్రీజులో ఉన్నారు.
-
ప్రారంభమైన మ్యాచ్..
వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. హారిస్ రవూఫ్ వేసిన బంతిని (11.4వ ఓవర్) ఇషాన్ సిక్స్‌గా మలిచాడు. 12 ఓవర్లకు టీమ్ఇండియా స్కోరు 58/3. ఇషాన్ (8), గిల్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మళ్లీ వర్షం..
మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు. 11.2 ఓవర్ల ఆట పూర్తి కాగానే వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతానికి భారత స్కోరు 51/3. శుభ్‌మన్ గిల్ (6), ఇషాన్ కిషన్(2) పరుగులతో ఉన్నారు.
-
శ్రేయస్ అయ్యర్ ఔట్
హారిస్ రవూఫ్ ఈ సారి భారత్‌ను దెబ్బ కొట్టాడు. రెండు బౌండరీలు బాది ఊపుమీద కనిపించిన శ్రేయస్ అయ్యర్ (14; 9 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో (9.5వ ఓవర్) ఫకార్ జమాన్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో భారత్ 48 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవర్లకు భారత స్కోరు 48/3. ఇషాన్ కిషన్(0), శుభ్‌మన్ గిల్(6) క్రీజులో ఉన్నారు.
-
అయ్యర్ రెండు ఫోర్లు
హారిస్ రవూఫ్ ఎనిమిదో ఓవర్‌ను వేశాడు. శ్రేయస్ అయ్యర్ రెండు ఫోర్లు కొట్టడంతో ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు భారత స్కోరు 42/2. శ్రేయస్ అయ్యర్ (13), శుభ్ మన్ గిల్(1) క్రీజులో ఉన్నారు.
-
కోహ్లి ఔట్
పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని ఆడడంతో మరోసారి టీమ్ఇండియా బ్యాటర్లు తడబడుతున్నారు. ముందుగా రోహిత్ శర్మ ఔట్ చేసిన షాహీన్ ఆ మరుసటి ఓవర్‌లో(6.3వ ఓవర్)నే పరుగుల యంత్రం విరాట్ కోహ్లిని సైతం క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో భారత్ 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
-
రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్
టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది. రెండు బౌండరీలతో మంచి ఊపుమీదున్న రోహిత్ శర్మ(11; 22 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. షహీన్ అఫ్రీది బౌలింగ్‌లో (4.6వ ఓవర్) రోహిత్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 15 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. వరుణుడు వల్ల మ్యాచ్ కాసేపు ఆగగా తిరిగి ప్రారంభం కాగానే రోహిత్ ఔట్ కావడం పాక్‌కు కలిసి వచ్చేదే. 5 ఓవర్లకు భారత స్కోరు 15/1.
-
ఆగిన వర్షం.. మొదలైన మ్యాచ్
వర్షం కురవడం ఆగింది. మైదాన సిబ్బంది పిచ్‌పై కవర్లను తొలగించి గ్రౌండ్‌ను మ్యాచ్ కు సిద్ధం చేశారు. దీంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
-
వరుణుడి ఆటంకం
దాయాదుల పోరుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత ఇన్నింగ్స్ 4.2 ఓవర్ల సమయంలో వర్షం కురవడం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. గ్రౌండ్ సిబ్బంది వెంటనే కవర్లను పిచ్‌పై కప్పేశారు. ప్రస్తుతానికి భారత స్కోరు 4.2 ఓవర్లకు 15/0. రోహిత్ శర్మ(11), శుభ్ మన్ గిల్ (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
మరో బౌండరీ
పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో టీమ్ఇండియా ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ముఖ్యంగా షహీన్ అఫ్రీది లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను షహీన్ వేయగా మూడో బంతికి ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు టీమ్ఇండియా స్కోరు 14/0. రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్ (0)లు క్రీజులో ఉన్నారు.
-
బౌండరీతో పరుగుల ఖాతా తెరిచిన రోహిత్ శర్మ
కీలక పోరులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు బరిలోకి దిగారు. మొదటి ఓవర్ ను షహీన్ అఫ్రిది వేశాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతిని బౌండరీకి తరలించి రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరిచాడు. మిగతా బంతులను కట్టుదిట్టంగా వేయడంతో మరో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 1 ఓవర్‌కు భారత స్కోరు 6/0. రోహిత్ శర్మ(5), శుభ్‌మన్ గిల్(0) లు క్రీజులో ఉన్నారు.
-
పాకిస్తాన్ తుది జట్టు
ఇమాముల్ హక్, ఫఖర్ జమాన్, బాబర్ అజామ్ (కెప్టెన్), రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హారిస్ రవూఫ్, షహీన్ అఫ్రిది, నసీమ్ షా.
-
టీమ్ఇండియా తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్