Womens World Cup 2025 : వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్.. సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో (Womens World Cup 2025) భారత్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.

India Women team must win upcoming 3 matchs to reach semis in Womens World Cup 2025
Womens World Cup 2025 : మహిళల వన్డే ప్రపంచకప్ 2025ను భారత్ వరుసగా రెండు విజయాలతో అద్భుతంగా ఆరంభించినా ఆ తరువాత గాడి తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆదివారం ఆసీస్ చేతిలో ఓడిపోవడంతో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
ప్రస్తుతం భారత్ రెండు విజయాలు, రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆస్ట్రేలియా, రెండో స్థానంలో ఇంగ్లాండ్‌లు ఉన్నాయి. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా, ఐదో స్థానంలో న్యూజిలాండ్‌లు ఉన్నాయి.
ఈ టోర్నీలో (Womens World Cup 2025) భారత్ మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ తప్పక విజయాలను సాధించాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై భారత్ విజయాలను సాధిస్తే.. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌లో అడుగుపెడుతుంది.
అలా కాకుండా.. ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. అప్పుడు ఇతర జట్ల సమీకరణాలు, నెట్‌రన్‌రేటు వంటి విషయాలపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం సెమీస్ అవకాశాలు గల్లంతు అవ్వడం ఖాయం.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌తో అంత ఈజీ కాదు..
టీమ్ఇండియా మిగిలిన మూడు మ్యాచ్‌లను ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది. ఇందులో బంగ్లాదేశ్ పై విజయం సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే.. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లను ఓడించడం అంత సులభం కాదు. ప్రస్తుతం ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ విజయం సాధించింది. మరో వైపు కివీస్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలవగా మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయినప్పటికి కివీస్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
సమిష్టిగా రాణించాల్సిందే..
టీమ్ఇండియా అన్ని విభాగాల్లోనూ సమిష్టిగా సత్తా చాటితే సెమీస్‌కు చేరుకోవడం పెద్ద కష్టం కాదు. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా రోడిగ్స్, ప్రతికా రావల్‌లు ఫామ్‌లోకి రావడం భారత్‌కు సానుకూలాంశం. లోయర్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ భీకర ఫామ్‌లో ఉంది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఫామ్ అందుకుంటే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగులేదు.
బౌలింగ్ విషయానికి వస్తే.. స్పిన్నర్లు రాణిస్తున్నప్పటికి పేసర్లు సత్తా చాటడడం లేదు. క్రాంతి గౌడ్, అమన్ జోత్‌లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వీలైనంత త్వరగా వీరంతా గాడిన పడితేనే భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది.