ఐపీఎల్ ఎప్పుడు? ఎక్కడ? షెడ్యూల్ సిద్ధమైందా?

  • Published By: vamsi ,Published On : July 21, 2020 / 01:38 PM IST
ఐపీఎల్ ఎప్పుడు? ఎక్కడ? షెడ్యూల్ సిద్ధమైందా?

Updated On : July 21, 2020 / 3:02 PM IST

ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు ఐపిఎల్ కోసం సాధ్యమైన షెడ్యూల్ సిద్ధం చేస్తుంది బీసీసీఐ.

రాబోయే 14 రోజుల్లో ఐపీఎల్‌కు అనుమతులు అడగడానికి బిసిసిఐ భారత ప్రభుత్వాన్ని సంప్రదించనుంది. ఐపిఎల్ 2020కి భారతదేశంలో అనుమతి లేనట్లయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ)లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

కాగా, ఐపీఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్‌ తొలి ఎంపిక అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి UAE మాత్రం అనుకూలంగా ఉంది.

రాబోయే రెండు వారాల్లో UAEలో ఐపిఎల్ నిర్వహించడానికి బిసిసిఐ ప్రభుత్వం అనుమతి తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఐపిఎల్ పాలక మండలి అధ్యక్షుడు బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. UAE ప్రభుత్వం తమ దేశంలో ఐపిఎల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిందని, అక్కడ ఉన్న సౌకర్యాలు మరియు పరిస్థితుల గురించి మాకు బాగా తెలుసునని ఆయన అన్నారు. ఐపిఎల్ యొక్క మొదటి దశ 2014లో అక్కడ జరిగింది కాబట్టి అక్కడ టోర్నీ జరపడంలో ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

ప్రయాణానికి UAE బాగా అనుకూలంగా ఉంటుందని బీసీసీఐ అభిప్రాయపడింది. ఐపిఎల్ లేకుండా 2020 సంవత్సరాన్ని ముగించాలని బీసీసీఐ భావించట్లేదని గంగూలీ అన్నారు. ఆగస్టు-సెప్టెంబరులో భారత ఆటగాళ్లకు శిక్షణా శిబిరం నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.