ఆ ఇద్దరితో CSK కాంట్రాక్ట్‌లు రద్దు.. ఐపీఎల్‌లో రైనా కథ ముగిసినట్లేనా?

  • Published By: vamsi ,Published On : October 2, 2020 / 04:56 PM IST
ఆ ఇద్దరితో CSK కాంట్రాక్ట్‌లు రద్దు.. ఐపీఎల్‌లో రైనా కథ ముగిసినట్లేనా?

Updated On : October 2, 2020 / 5:48 PM IST

ఐపీఎల్ 2020కి ముందు, ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్స్ సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఈ సీజన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో వీరు ఇద్దరు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం అయ్యారు. దీని తరువాత, CSK వారి వెబ్‌సైట్ నుంచి ఇద్దరు ఆటగాళ్ల పేర్లను తొలగించింది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజ్ ఇప్పుడు వారికి వ్యతిరేకంగా మరో కీలక అడుగు వేసింది. CSK ఇద్దరు ఆటగాళ్లతో తన ఒప్పందాన్ని ముగించే ప్రక్రియను ప్రారంభించింది.



ఐపీఎల్ వేలం మార్గదర్శకాల ప్రకారం, 2018 లో హర్భజన్ సింగ్, సురేష్ రైనా CSKతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇది 2020తో ముగిసింది. అయితే, ఈ సీజన్‌లో ఆడటానికి ఈ ఇద్దరు ఆటగాళ్లకు కుదరలేదు. ఈక్రమంలో ఫ్రాంచైజ్, తదుపరి చర్య తీసుకుంది. ఇద్దరితో తన ఒప్పందాన్ని ముగించాలని అధికారికంగా నిర్ణయించింది. సురేష్ రైనా 11 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోగా, హర్భజన్ సింగ్ 2 కోట్లకు సంతకం చేశాడు. అయితే ఇప్పుడు ఇద్దరు ఆటగాళ్లకు ఈ సంవత్సరం జీతం ఇవ్వబడదు.



రైనా, హర్భజన్ సింగ్‌లు 2020 వరకు సిఎస్‌కెతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫ్రాంచైజ్ వారితో ఒప్పందాన్ని ముగించినట్లయితే, ఇద్దరి ఐపీఎల్ కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ టోర్నీకి సమయం లేకపోవడం వల్ల BCCI ఆటగాళ్ల వేలం నిర్వహించలేకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో, రైనా మరియు భజ్జీలకు CSKతో ఒప్పందం లేని కారణంగా 2021 ఐపిఎల్ సీజన్‌కు వీరు ఇద్దరు దూరంగా ఉండవలసి వస్తుంది.



సీఎస్‌కే నిర్ణయంతో రైనాకు పూర్తిగా దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. మొన్నటి వరకు రైనా తిరిగి వస్తాడనుకున్న రైనా ఆశలు కూడా అడియాశలై పోయాయి. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ధోనీ జట్టు.. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. హిట్టింగ్‌లేని బ్యాటింగ్‌తో పాటు పసలేని బౌలింగ్‌ టీమ్‌ను ఇబ్బంది పెడుతుంది.