యూఏఈలోనే ఐపీఎల్-2020: నవంబర్ 10న ఫైనల్స్.. అనుమతించిన ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : August 3, 2020 / 06:50 AM IST
యూఏఈలోనే ఐపీఎల్-2020: నవంబర్ 10న ఫైనల్స్.. అనుమతించిన ప్రభుత్వం

Updated On : August 3, 2020 / 10:29 AM IST

ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో ఐపీఎల్ 13 వ సీజన్‌కు సంబంధించి పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సీజన్‌ను యూఏఈలో నిర్వహించడానికి భారత ప్రభుత్వం అనుమతించింది. ఈసారి సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ఈ లీగ్ జరగనుంది. లీగ్‌లో ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10వ తేదీన జరుగుతుంది. అయితే ప్రతిసారిలా కాకుండా ఈసారి, మ్యాచ్‌ల టైమింగ్‌లో మార్పులు చేశారు.



ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు పది రోజులు జరుగుతాయి. ఆ మ్యాచ్‌ల టైమింగ్‌లో మార్పులు చేయబడ్డాయి. రెండు మ్యాచ్‌ల రోజున, మొదటి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండవ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు, రెండవ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అయ్యేవి. ఇది కాకుండా, ఈ సీజన్‌లో మ్యాచ్ జరిగే రోజు భారత సమయం ప్రకారం రాత్రి 7:30కి ప్రారంభం అవుతుంది. అంతకుముందు సీజన్‌లో, మ్యాచ్ జరిగిన రోజు, రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది.

లీగ్ ప్రారంభ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా జరుగుతాయి, కొన్ని మ్యాచ్‌ల తర్వాత, స్టేడియంలో జరిగే మ్యాచ్‌లను చూడటానికి ప్రేక్షకులను అనుమతించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటారు. ఇది కాకుండా, కోవిడ్-19 మహమ్మారి సోకిన ఆటగాడిని భర్తీ చేస్తామని కూడా అంగీకరించారు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ దుబాయ్, షార్జా, అబుదాబిలలో జరుగుతాయి. ఈ సమావేశంలో, చైనా కంపెనీలతో సహా అన్ని స్పాన్సర్‌లను నిలుపుకోవాలని నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ పాలక మండలి.



టైటిల్‌ స్పాన్సరైన చైనా మొబైల్‌ కంపెనీ వివో సహా స్పాన్సర్లందరినీ కొనసాగించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. చైనా, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కెంపెనీల స్పాన్సర్‌షిప్‌ గురించి గత కొన్ని వారాలుగా పెద్ద ఎత్తున చర్చ జరగగా.. ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. ఆ కంపెనీతో బీసీసీఐ ఒప్పందం 2022తో ముగుస్తుంది. వివోను వద్దనుకుంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ను పొందడం బోర్డుకు కష్టం అయ్యేది.

ఈ ఏడాది మహిళల ఐపీఎల్‌ కూడా నిర్వహించాలని ఐపీఎల్‌ పాలకవర్గం నిర్ణయించింది. ‘‘యూఏఈలో మహిళల టీ20 ఛాలెంజ్‌ జరుగుతుంది. ఇందులో మూడు జట్లు ఉంటాయి. ఐపీఎల్‌ ప్లేఆఫ్‌ వారాల్లో నాలుగు మహిళల మ్యాచ్‌లు జరుగుతాయి’’ అని ప్రకటనలో బోర్డు తెలిపింది. దీంతో మహిళల మ్యాచ్‌లు ఉండవేమో అన్న ఊహాగానాలకు తెరపడింది. గతేడాది లాగే ఐపీఎల్‌ చివరి దశలో మహిళల ఛాలెంజర్‌ ఉంటుందని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించారు. మహిళల ఛాలెంజ్‌ నవంబరు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగవచ్చు.



దేశంలో సాధారణ ఎన్నికల సందర్భంలో ఐపీఎల్‌ రెండుసార్లు (2009, 2014) విదేశాల్లో జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దేశం బయట జరుగనుంది. మొత్తం 53 రోజుల పాటు జరుగనున్న ఈ సీజన్‌లో 10 రోజులు రెండేసి మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతీ ఫ్రాంచైజీ 24 మంది ఆటగాళ్లతో పాటు సహాయ సిబ్బందిని వెంట తీసుకెళ్లొచ్చు. ఆటగాళ్లంతా చార్టెడ్‌ విమానాల్లోనే దుబాయ్‌ చేరుకోనున్నారు.